అందరికీ అందుబాటులో AI గూగుల్ లక్ష్యం: సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 05:10:54  IST  )

సాంకేతికత కేవలం కొందరికే పరిమితం కాకుండా, భాషా అడ్డంకులను అధిగమిస్తూ ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో అందరికీ సమానంగా అందాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిలుపునిచ్చారు.

అందరికీ అందుబాటులో AI గూగుల్ లక్ష్యం: సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో రైతులకు ఏఐ (AI) అండగా నిలుస్తోందని.. గతంలో ఉన్న భాషా అండకులకు చెక్ పెట్టామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 (India AI Impact Summit-2026)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వేసవిలో భారత ప్రభుత్వం లక్షలాది మంది రైతులకు AI ఆధారిత వాతావరణ అంచనాలను పంపిందని తెలిపారు. గూగుల్ అభివృద్ధి చేసిన న్యూరల్ జీసీఎం మోడల్ (Neural GCM Model) సహాయంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దీంతో వాతావరణ మార్పులను ముందే పసిగట్టి పంటలను కాపాడుకునే అవకాశం రైతులకు లభించిందని పిచాయ్ తెలిపారు.

భాషా వైవిధ్యం..

ఏఐ (AI) అందరికీ అందుబాటులో ఉండాలన్నది గూగుల్ లక్ష్యమని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్‌ త్వరలోనే ఫుల్‌‌స్టాక్‌ ఏఐ హబ్‌లు ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఘనాలోని విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి 20కి పైగా ఆఫ్రికన్ భాషలలో పరిశోధనలు, ఓపెన్ సోర్స్ టూల్స్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు. భారతీయ భాషల్లో కూడా ఇటువంటి పురోగతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాల మెరుగుదలకు AI ఒక శక్తివంతమైన సాధనమని, సాంకేతికత అందించే ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వ్యక్తికీ అందేలా చూడటం మన బాధ్యత అని అన్నారు. సాంకేతికత అద్భుతమైన ప్రయోజనాలను తెస్తుందని, కానీ అవి అందరికీ అందుబాటులో ఉండేలా విస్తరించజేయాలని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

Next Story