రాష్ట్రంలోని కార్మికులకు తీపికబురు.. భారీగా వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 04:25:43  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ ఉత్తర ప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని కార్మికులకు తీపికబురు.. భారీగా వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రామిక వర్గానికి భారీ ఆర్థిక భరోసానిచ్చేలా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ రంగాల్లోని కార్మికుల కనీస వేతనం రూ.11,313 నుంచి రూ.13,690కి పెంపు పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్‌స్కిల్డ్, సెమీ-స్కిల్డ్, స్కిల్డ్ కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. తాజా పరిణామంతో పారిశ్రామిక కేంద్రమైన నోయిడా (Noida) పరిధిలోని కార్మికులకు అత్యధికంగా వేతనాలు పెరిగాయి. ఇక్కడ నివసించే కార్మికుల జీవన ప్రమాణాలు, అక్కడి పారిశ్రామిక అవసరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అధిక వేతన పెంపును వర్తింపజేసింది.

ఎవరికి ప్రయోజనం..?

ప్రభుత్వ తాజా సవరణల ప్రకారం.. అన్‌స్కిల్డ్ (Unskilled) వర్కర్ల పరిధిలో దినసరి కూలీలు, లోడర్లు, హెల్పర్లు ఉన్నారు. ఇక సెమీ-స్కిల్డ్ (Semi-skilled) వర్కర్ల విభాగంలో కొంత అనుభవం ఉన్న అసిస్టెంట్లు, ప్యాకర్లు, అదేవిధంగా స్కిల్డ్ (Skilled) వర్కర్లలో టెక్నీషియన్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు ఉన్నారు. వీరందరికీ పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ప్రైవేట్ ఫ్యాక్టరీలు, దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు ఈ కొత్త వేతనాల ప్రకారం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొత్త వేతనాల అమలులో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని కార్మిక శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Next Story