దేశంలోని రైతులకు తీపికబురు.. కాసేపట్లో ‘పీఎం కిసాన్’ నిధులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-13 06:11:41  IST  )

పీఎం కిసాన్ 22వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అస్సాంలోని గౌహతి వేదికగా కాసేపట్లో విడుదల చేయనున్నారు.

దేశంలోని రైతులకు తీపికబురు.. కాసేపట్లో ‘పీఎం కిసాన్’ నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ విడుదల చేయనున్నారు. అస్సాంలోని గౌహతి వేదికగా జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. అయితే, ఈ విడతలో దాదాపు 9.32 కోట్ల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.18,640 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది.

రాబోయే ఖరీఫ్ సాగు కాలానికి ముందే ఈ నిధులు విడుదల కావడం వల్ల రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి అవసరాలకు ఈ నగదు ఎంతో తోడ్పడనుంది. ఈ విడత లబ్ధిదారులలో సుమారు 2.15 కోట్ల మందికి పైగా మహిళా రైతులు కూడా ఉండటం విశేషం. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ప్రతి రైతుకు రూ.2 వేల చొప్పున జమ చేయనున్నారు..

స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..

రైతులు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించి, ‘Know Your Status’ విభాగంలో తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా వివరాలు చూసుకోవచ్చు. కాగా, ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ నిధులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.

నేడే రైతుల ఖాతాల్లోకి రూ.6000...ఇలా చెక్ చేసుకోండి

Next Story