ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. పాత ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు ‘ఈ-ప్రాప్తి’ పోర్టల్

by Ramesh Naini |

పాత, ఉపయోగంలో లేని పీఎఫ్ (EPF) ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలనుకునే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. పాత ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు ‘ఈ-ప్రాప్తి’ పోర్టల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాత, ఉపయోగంలో లేని పీఎఫ్ (EPF) ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలనుకునే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. యూఏఎన్ (UAN) అనుసంధానం కాకుండా, మూలనపడిన పాత ఖాతాలను గుర్తించి, సులభంగా యాక్టివేట్ చేసుకునేందుకు వీలుగా ఈపీఎఫ్‌వో (EPFO) త్వరలో ‘ఈ-ప్రాప్తి’ (E-PRAAPTI) పేరిట ఒక సరికొత్త ఆధార్ ఆధారిత డిజిటల్ పోర్టల్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ బుధవారం వెల్లడించింది.

‘ఈ-ప్రాప్తి’ పోర్టల్ ప్రత్యేకతలు ఇవే..

‘ఈ-ప్రాప్తి’ (EPF Aadhaar-Based Access Portal for Tracking Inoperative Accounts) అనేది పాత ఈపీఎఫ్‌ ఖాతాలను ట్రాక్ చేయడానికి, యూఏఎన్ (UAN) లింక్ చేయడానికి, ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్.

సులభమైన యాక్సెస్.. భవిష్యత్తులో అందరికీ

పాత పీఎఫ్ ఖాతాలను సభ్యులు సురక్షితంగా యాక్సెస్ చేయడానికి ఈ పోర్టల్ లో పటిష్టమైన ఆధార్ ఆధారిత అథెంటికేషన్ (ధృవీకరణ) సదుపాయం ఉంటుంది. తద్వారా సులభంగా ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకొని యూఏఎన్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ప్రారంభ దశలో, తమ పాత మెంబర్ ఐడీలు (Member IDs) గుర్తున్న లేదా అందుబాటులో ఉన్న వారి కోసం ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. తమ ఐడీని మర్చిపోయిన వారు కూడా పాత ఖాతాలను తిరిగి పొందేలా భవిష్యత్తులో ఈ పోర్టల్ సేవలను విస్తరించనున్నారు. దీని ద్వారా మాన్యువల్ ప్రమేయం, డాక్యుమెంటేషన్ తగ్గి పారదర్శకత, వేగం పెరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

యజమాని ప్రమేయం లేకుండా..

ఈపీఎఫ్‌వో సేవల వేగం పెరిగిందని తెలిపేందుకు కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2024-25లో 6.01 కోట్ల క్లెయిమ్‌లు పరిష్కరించగా, 2025-26లో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో పరిష్కరించింది. 1.59 కోట్ల మంది తమ యజమాని (Employer) ఆమోదం లేకుండానే బ్యాంకు ఖాతాలను అనుసంధానించుకోగా, 70.55 లక్షల బదిలీ (Transfer) క్లెయిమ్‌లు ఆటో-ప్రాసెస్ అయ్యాయి. మరో 24.84 లక్షల ట్రాన్స్‌ఫర్ అభ్యర్థనలను సభ్యులే స్వయంగా చేసుకున్నారు. 29.34 లక్షల మంది ఈపీఎఫ్‌వో లేదా యజమానితో పనిలేకుండా తమ పీఎఫ్ ప్రొఫైల్స్‌ను ఆన్‌లైన్‌లోనే సరిదిద్దుకోగలిగారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాత్రమే 61.03 లక్షల క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. ఇందులో దాదాపు 74 శాతం పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లు ఆటో మోడ్‌లో ప్రాసెస్ కాగా, మొత్తం క్లెయిమ్‌లలో 98.70 శాతం కేవలం 20 రోజుల్లోపే పరిష్కారం కావడం గమనార్హం.

Next Story