- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారు కిరీటం.. బంగారపు కత్తి.. జయ ఆస్తులు తమిళనాడు సర్కారుకు అప్పగింత
జయలలిత నుంచి జప్తు చేసిన ఈ విలువైన వస్తువులు, దస్తావేజులు అన్నీ చాలా ఏళ్లుగా న్యాయపరమైన వివాదంలో ఉన్నాయి.

- ఆస్తుల్లో 1,100 కిలోల వెండి.. 1,525 ఎకరాల భూమి
- ప్రతీ వస్తువును ఫొటో తీసిన తమిళనాడు అధికారులు
దిశ, నేషనల్ బ్యూరో: బంగారు కిరీటం.. కత్తి.. వేలాది చీరలు.. వజ్రాభరణాలు.. దస్తావేజులు.. ఇంకెన్నో... దివంగత తమిళనాడు సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో జప్తు చేసిన వస్తువులు, ఆస్తులను బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ అధికారులు 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 27.558 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 1,116 కిలోల వెండి వస్తువులు, 1,526 ఎకరాల భూములకు సంబంధించిన దస్తావేజులు పత్రాలను కర్ణాటక విధాన సౌధ ట్రెజరీలో ఇన్నాళ్లూ దాచి పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ వస్తువులన్నింటీని తమిళనాడు అధికారులకు అప్పగించారు. అంతకు ముందు ప్రతీ వస్తువును తమిళనాడు అధికారులు ఫొటోలు తీశారు. ఇందులో ఒక క్లిష్టమైన డిజైన్‌లో ఉన్న బంగారు కిరీటం, నగీషీలతో కూడిన ఒక కత్తి, ఇతర ఆభరణాలు ఉన్నాయి. జయలతిత తన రూపాన్ని ఒక బంగారు శిల్పంగా తయారు చేయించుకున్నారు. దాన్ని కూడా ఇన్నాళ్లూ ఒక పెట్టెలో భద్రపరిచి ఉంచారు.
జయలలిత నుంచి జప్తు చేసిన ఈ విలువైన వస్తువులు, దస్తావేజులు అన్నీ చాలా ఏళ్లుగా న్యాయపరమైన వివాదంలో ఉన్నాయి. జయ ఆస్తులకు తమనే వారసులుగా ప్రకటించాలని మేనకోడలు జే.దీప, మేనల్లుడు జే. దీపక్ న్యాయపోరాటం చేశారు. కానీ కోర్టు వారి వ్యాజ్యాన్ని కొట్టేసింది. అవినీతి కేసులో సీజ్ చేసిన జయలలిత ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు చెప్పింది. 2024 మార్చిలోనే ఈ ఆస్తుల అప్పగింత జరగాల్సి ఉన్నా.. దీప, దీపక్ తమకే ఈ ఆస్తులు అప్పగించాలని కోర్టులో కేసు వేయడంతో ఆలస్యం అయ్యింది. 2025 జనవరి 13న కర్ణాటక హైకోర్టు వీరి పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం అధికారులను పంపించి ఆస్తులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుంది.
జయలలిత ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ విజిలెన్స్ హాజరయ్యారు. అంతేకాకుండా ఆభరణాలను తీసుకెళ్లడానికి 6 ట్రంకు పెట్టెలను వెంట తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు వీడియోగ్రాఫర్, ఫొటో గ్రాఫర్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. కాగా, ప్రస్తుతం అధికారులు వీటి ప్రస్తుత విలువను లెక్కకట్టే పనిలో ఉన్నారు.






