ఖాతాలో డబ్బు లేకున్నా.. మనీ డ్రా!

by Harish SP |   (  Updated:2025-02-04 11:42:41  IST  )

- యూకే బ్యాంకులో టెక్నికల్ ప్రాబ్లమ్ - ఏటీఎంలనుంచి లక్షల పౌండ్లు ఖాళీ - సైబర్ మోసమని అనుమానాలు

ఖాతాలో డబ్బు లేకున్నా.. మనీ డ్రా!
X

యూకే బ్యాంకులో టెక్నికల్ ప్రాబ్లమ్

ఏటీఎంలనుంచి లక్షల పౌండ్లు ఖాళీ

సైబర్ మోసమని అనుమానాలు

యునెటైడ్ కింగ్‌డమ్ (బ్రిటన్)లో రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన బార్క్ లేస్ బ్యాంకులో మూడురోజుల క్రితం చోటుచేసుకున్న సాంకేతిక అంతరాయం చాలామంది పాలిట వరంలా మారింది. ఖాతాల్లో నగదు లేకున్నా రెండు, మూడు వేల పౌండ్లు ఏటీఎం ద్వారా డ్రా అయ్యాయి. దీంతో చాలామంది ఖాతాదారులు బ్యాంకు ఏటీఎం వద్ద బారులు తీరి నగదు డ్రా చేసుకున్నారు. జనవరి 31వ తేదీన చాలామంది ఉద్యోగులకు బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడుతాయి. దీంతో వారంతా జీతాలు తీసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేయగా.. అది పనిచేయలేదు. దీంతో బ్యాంకు వద్దకు చేరుకోగా సాంకేతిక సమస్య వచ్చిందని ఖాతాదారులకు చెప్పి పంపించారు. అయితే, ఏటీఎంల్లో నగదు డ్రా అవుతుందని తెలిసి.. అందులోంచి తీసుకున్నారు. అయితే, కొందరికి ఖాతాల్లో ఒక్క పౌండు లేకపోయినా.. వేల పౌండ్లు వచ్చాయి. దీంతో ఈ విషయం తెలిసి.. చాలామంది జీరో బ్యాలెన్స్ ఖాతాదారులు బ్యాంకు ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసి నగదు డ్రా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏటీఎంలు ఉండటంతో వాటిలోని నగదు పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఈ తంతంగం కొనసాగిందని.. ఈ చర్యతో బ్యాంకుకు దాదాపు 20మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని యూకేలోని ప్రవాస భారతీయులు వెల్లడించారు. అయితే, ఏటీఎంల్లో నగదు నింపడంలేదని.. సాంకేతిక సమస్య పూర్తయ్యాకే నష్టం ఎంతవరకు అయ్యిందో పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయని బ్యాంకు వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. బ్యాంకు సేవల పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని తెలుస్తున్నది.

స్నేహితుల వద్ద అప్పు తీసుకోండి..
ఓ వైపు ఖాతాలో డబ్బులు పడక వినియోగదారులు ఇబ్బంది పడుతుంటే.. బ్యాంకు ఇచ్చిన ఉచిత సలహా వారికి మరింత ఆగ్రహం కలిగింది. బ్యాంకు సేవలు పునరుద్ధరణ అయ్యే వరకు స్నేహితులు, కుటుంబసభ్యుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవాలని మెసేజులు పంపండాన్ని ఖాతాదారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని మండిపడుతున్నారు.

Next Story