- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వండి.. మూడు రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల లేఖ
భద్రతా దళాలు చేపడుతున్న ‘ఆపరేషన్ కాగర్’ (Operation Kagar) చరమాంకానికి చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: భద్రతా దళాలు చేపడుతున్న ‘ఆపరేషన్ కాగర్’ (Operation Kagar) చరమాంకానికి చేరింది. ఓ వైపు దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లు.. మరోవైపు అగ్ర నేతల లొంగుబాట్ల వేళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జోనల్ కమిటీ (MMC) అనంత్ పేరిట మావోయిస్టు పార్టీ (Maoist Party) సంచలన లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో మూడు రాష్ట్రాల సీఎంలు మోహన్ యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, విష్ణుదేవ్ సాయిలకు కీలక అభ్యర్థన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో మెంబర్ సోనూ దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు. సీసీఎం సతీష్ దాదాతో పాటు సీసీఎం మెంబర్ కామ్రేడ్ చంద్రన్న ఆయన నిర్ణయాన్ని బలపరిచారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఎంసీ జోనల్ కమిటీ కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలనుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఆయుధాలు వదిలేసే అంశంలో సమష్టిగా నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఫిబ్రవరి 15, 2026 వరకు తమకు టైమ్ ఇవ్వాలని కోరారు. తాము సమయం అడిగే విషయంలో ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదని అన్నారు. మావోయిస్టుల అణిచివేతకు కేంద్రం మార్చి 31, 2026 వరకు గడువు విధించిందని.. అప్పటి వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని లేఖలో ప్రస్తావించారు.
కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తాం..
ఇక రాబోయే పీఎల్‌జీఏ (PLGA) వార్షికోత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించకూడదని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎంఎంసీ జోన్ కమిటీ రిక్వెస్ట్ చేసింది. అదేవిధంగా ఎంఎంసీ జోన్ పరిధిలోని దళ సభ్యులంతా కార్యకలాపాలను నిలిపివేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ లేఖలోని సందేశాన్ని వీలైనంత త్వరగా రేడియోలో ఆయా ప్రభుత్వాలు ప్రసారం చేయాలని.. అప్పుడు తమ సహచరులకు సమాచారం తెలుస్తుందని అన్నారు. లొంగిపోయే ముందు మూడు రాష్ట్రాల్లోని కొంతమంది ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తాము సాముహికంగా ఆయుధాలు వదిలి పునరావాస ప్రణాళికను అంగీకరించేందుకు ఒక నిర్ధిష్టమైన తేదీని ప్రకటించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ అంతా భద్రతా బలగాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేస్తే సాధ్యం అవుతుందని అన్నారు. త్వరలోనే ఆయుధాలు వదిలే కచ్చితమైన తేదీని ప్రకటిస్తామని తెలిపారు. తమ వార్తలను జర్నలిస్టులు ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానళ్లలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో చేసినట్లుగానే ఎంఎంసీ జోన్‌లో కూడా అదేవిధంగా వారి పాత్రను పోషించాలని లేఖలో వెల్లడించారు.
Read More..






