- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు ఎన్నికల్లో గెలుపు
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్.. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్.. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. జలన్నా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 2,621 ఓట్ల తేడాతో 13వ నెంబరు వార్డులో నెగ్గారు. బీజేపీ సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఆయన ఓడించారు. ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన ఇక్కడ ఎవర్నీ పోటీలో ఉంచలేదు. దీంతో ఇండిపెండెంట్లు, పార్టీల మధ్య పోటీ నెలకొంది. గౌరీ లంకేశ్ హత్య కేసులో ఆయనపై ఇంకా విచారణ జరుగుతుండటం గమనార్హం. ఈ సమయంలో ఎన్నికల్లో నిలబడి గెలిచిన ఆయన.. తనను కోర్టులు దోషిగా తేల్చలేదని, లీగల్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇలాంటి సంచలన కేసుల్లో నిందితులు ఎన్నికల్లో నిలబడటంపై చర్చలు మొదలయ్యాయి.
గౌరీ లంకేశ్ హత్య కేసు
ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అయిన గౌరీ లంకేశ్‌ను.. బెంగళూరులో తన ఇంటి ముందే కొందరు కాల్చి చంపారు. 2017 సెప్టెంబరు 5న ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో భావ ప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ నేతల బల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కొన్నిరోజులకే పంగార్కర్ పేరును ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. 2024 సెప్టెంబరు 4న కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2001 నుంచి 2006 వరకు శివసేన తరఫున జల్నా కార్పొరేటర్‌గా ఉన్న పంగార్కర్.. 2011లో టికెట్ దక్కకపోవడంతో రైట్ వింగ్ హిందూ జనజాగృతి సమితిలో చేరారు. 2018లో మహారాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నాటు బాంబులు, ఆయుధాలు దొరికిన కేసులో రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆయన్ను అరెస్టు చేసింది. 2024 నవంబరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు బెయిలుపై ఉన్న పంగార్కర్‌ను పార్టీలో చేర్చుకోవాలని ఏక్‌నాథ్ శిండే భావించారు. అయితే దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. జల్నాలో పంగార్కర్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎవర్నీ నిలబెట్టకపోవడం గమనార్హం.






