ఎల్‌పీజీ కొరత వేళ.. బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్ల చోరీల కలకలం

by Ramesh Naini |

ఈ పరిణామాల మధ్య బెంగళూరు నగరంలో గ్యాస్ సిలిండర్ల చోరీలు జరగడం కలకలం రేపుతోంది.

ఎల్‌పీజీ కొరత వేళ.. బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్ల చోరీల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఎల్‌పీజీ (LPG) కొరత ఏర్పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య బెంగళూరు నగరంలో గ్యాస్ సిలిండర్ల చోరీలు జరగడం కలకలం రేపుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిలిండర్లను దొంగిలిస్తున్న రెండు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలు

కళ్యాణ్‌ నగర్ పరిధిలో జరిగిన ఒక ఘటనలో, ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి, ఇంటి వద్ద ఉన్న గ్యాస్ సిలిండర్‌ను గోనె సంచిలో చుట్టి చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను వార్తా సంస్థ 'పీటీఐ' తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. మరో ఘటన చెన్నపట్నంలో చోటుచేసుకుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి, ఇంటి బయట ఉంచిన సిలిండర్‌ను దొంగిలించి పరారయ్యారు. ఈ రెండు ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి

సిలిండర్ల చోరీలు కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు. దిండుగల్‌లోని మెంగ్లెస్ రోడ్డులో గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి తన ట్రైసైకిల్‌ను నిలిపివేసి, ఒక ఇంటికి సిలిండర్ ఇచ్చి వచ్చేలోపు వాహనంపై ఉన్న మరో సిలిండర్‌ను దుండగులు అపహరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో హోలీ పండుగ సమయంలో లారీలో ఉన్న 500 ఎల్‌పీజీ సిలిండర్లను మాయం చేశారు. దర్యాప్తు తర్వాత వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Next Story