- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిక్ష పూర్తయినా జైల్లోనే ఉంచారు.. సుప్రీంకోర్టులో గ్యాంగ్‌స్టర్ అబూసలేం పిటిషన్
తన 25 ఏళ్ల శిక్షాకాలం పూర్తయిందని, తనను అక్రమంగా జైల్లో ఉంచుతున్నారంటూ గ్యాంగ్‌స్టర్ అబూసలేం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : 1993 ముంబయి పేలుళ్ల కేసులో కీలక దోషి, గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన 25 ఏళ్ల శిక్షాకాలం పూర్తయిందని, తనను అక్రమంగా జైల్లో ఉంచుతున్నారంటూ అతను దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా అబూ సలేం తరపు న్యాయవాది రిషి మల్హోత్రా వాదిస్తూ.. సలేం ఇప్పటికే 10 నెలల అదనపు శిక్షను అనుభవించారని, ఇది అక్రమ నిర్బంధం కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘మీరు సమాజానికి ఏదో మంచి చేసి జైలుకు రాలేదు. టాడా (TADA) చట్టం కింద మీరు దోషిగా తేలారు’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే బాంబే హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతున్నందున, అక్కడే తేల్చుకోవాలని కోర్టు సూచించింది.
వివాదం ఎక్కడంటే?
అబూ సలేం విడుదలకు సంబంధించి ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చినట్లు జాతీయ మీడియా చెబుతోంది. 2005లో పోర్చుగల్ నుంచి సలేంను భారత్‌కు రప్పించినప్పుడు, అతనికి మరణశిక్ష వేయబోమని, గరిష్టంగా 25 ఏళ్లకు మించి జైల్లో ఉంచబోమని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. జైలు నిబంధనల ప్రకారం లభించే సత్ప్రవర్తన రాయితీలను (Remission) కలిపితే తన 25 ఏళ్ల గడువు ముగిసిందని సలేం వాదిస్తున్నాడు. అయితే, జైళ్ల శాఖ లెక్కల ప్రకారం మార్చి 2025 నాటికి అతను కేవలం 19 ఏళ్ల 5 నెలల 18 రోజులు మాత్రమే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా, 2005 నవంబరులో పోర్చుగల్ నుంచి సలేంను భారత్‌కు తీసుకొచ్చారు. ముంబయి వరుస పేలుళ్ల కేసులో 2017లో అతనికి జీవిత ఖైదు పడింది. అంతకుముందు 1995లో బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులోనూ అతనికి శిక్ష పడింది. 2022 లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. అబూ సలేం శిక్షాకాలం అతను భారత అధికారులకు అప్పగించబడిన డిసెంబర్ 10, 2005 నుంచే లెక్కించబడుతుందని జాతీయ మీడియా తెలిపింది.






