డాలర్ల వేటలో ప్రాణాలతో చెలగాటం.. ఎవరెస్ట్ అంచున భారీ రెస్క్యూ స్కామ్

by Kema Shiva Kumar |

ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆహారంలో విషం కలిపి, నకిలీ హెలికాప్టర్ రెస్క్యూలతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

డాలర్ల వేటలో ప్రాణాలతో చెలగాటం.. ఎవరెస్ట్ అంచున భారీ రెస్క్యూ స్కామ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు శిఖరాలను ముద్దాడాలనే ఆశతో, కంటికిరెప్పలా కాపాడతారని టూరిస్ట్ గైడ్‌ (Tourist Guide)ల‌ను నమ్మిన పర్యాటకులకు వెన్నుపోటు పొడిచారు. ప్రాణాలకు తెగించి మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) ఎక్కే పర్వతారోహకులకు కొండంత అండగా ఉండాల్సిన వారే, ఇన్సూరెన్స్ డబ్బు కోసం కక్కుర్తిపడి వారి ఆహారంలో విషం కలిపి మృత్యువు అంచులకు నెట్టేస్తున్నారు. ప్రస్తుతం మౌంట్ ఎవరెస్ట్ వద్ద జరుగుతున్న భారీ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను వణికిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించాలనే కలతో దేశ విదేశాల నుంచి టూరిస్టులు పెద్దఎత్తున ఖట్మాండుకు చేరుకుంటున్నారు. ఇదే అక్రమార్కుల దందాకు అసరాగా మారింది. అయితే, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసే ఆహారం, నీటిలో కావాలనే కలుషిత పదార్థాలైన ల్యాక్సేటివ్స్ (Laxatives), బేకింగ్ సోడా (Baking Soda) కలిపి వారు అనారోగ్యం పాలయ్యేలా కొందరు గైడ్‌లు చేస్తున్నారు. దీంతో పర్యాటకులకు తీవ్రమైన వాంతులు, వికారం కలుగుతాయి.

హెలికాప్టర్ రెస్క్యూ స్కామ్..

అయితే, పర్యాటకులు అనారోగ్యానికి గురైన వెంటనే, అది ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ (Altitude Sickness) అంటే ఎత్తు ప్రదేశాల వల్ల వచ్చే అనారోగ్యం అని భయపెట్టి, అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా వారిని కిందికి తరలిస్తున్నారు. ఒక్కో హెలికాప్టర్ రెస్క్యూ (Helicopter Rescue) కోసం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వేల డాలర్లను వసూలు చేస్తున్నారు. ఈ స్కామ్‌లో గైడ్‌లతో పాటు కొన్ని టూర్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు కుమ్మక్కైనట్లుగా తెలుస్తోంది. ఈ భారీ నెట్‌వర్క్‌తో దాదాపు ఇప్పటి వరకు 20 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.165 కోట్ల ఇన్సూరెన్స్ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం (Nepal Government) ఇప్పటికే పలువురు గైడ్‌లు, ఏజెన్సీలపై విచారణకు ఆదేశించింది. పర్యాటకుల ప్రాణాలను కాపాడాల్సిన గైడ్‌లే ఇలా విషం ఇచ్చి మోసాలకు పాల్పడటం అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ పర్యాటక రంగానికి మాయనిమచ్చగా మారింది. ఎవరెస్ట్ ట్రెకింగ్‌కు వెళ్లే వారు గైడ్‌ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.

Next Story