G7: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు.. జీ7 దేశాల ప్రకటన

by B.Srinivas |

ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంపై జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చాయి.

G7: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు.. జీ7 దేశాల ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ఇరాన్ (Israel Iran) వివాదంపై జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చాయి. ఇరాన్ అణు బాంబును కలిగి ఉండటానికి అనుమతించలేమని స్పష్టం చేశాయి. ఈ మేరకు కూటమిలోని దేశాలు కెనడా (Canada)లోని కననాస్కిస్‌లో జరుగుతున్న సమ్మిట్‌లో భాగంగా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి జీ7 కట్టుబడి ఉంది. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఇజ్రాయెల్ భద్రతకు మద్దతు తెలుపుతున్నాం. ప్రాంతీయ అస్థిరతకు ఇరాన్ ప్రధాన కారణం. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండొద్దు. దానిని ఎప్పటికీ అనుమతించబోము’ అని తెలిపాయి. పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నట్టు వెల్లడించాయి.

ఉక్రెయిన్ కు సైనిక సాయం

జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఉక్రెయిన్‌కు 2 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అధునాతన డ్రోన్‌లు, హెలికాప్టర్లు, ఇతర సైనిక పరికరాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ఉక్రెయిన్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు కార్నీ వెల్లడించారు. వివాదాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కెనడా చేరుకున్న మోడీ

జీ7 సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ చేరుకున్న తర్వాత మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘జీ7 సమ్మిట్‌లో పాల్గొనడానికి కెనడాకు వచ్చాను. పలు దేశాధి నేతలతో సమావేశమై ప్రపంచ సమస్యలపై నా అభిప్రాయాలను తెలియజేస్తా. ఈ సదస్సు ఎంతో కీలకమైనది’ అని పేర్కొన్నారు. మరోవైపు మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఖలిస్థాన్ మద్దతు దారులు నిరసన తెలిపారు.

Next Story