ఖమేనీ అంత్యక్రియలపై ముగిసిన సస్పెన్స్.. అంతిమ యాత్ర షెడ్యూల్ ఫిక్స్

by Ramesh Naini |

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది.

ఖమేనీ అంత్యక్రియలపై ముగిసిన సస్పెన్స్.. అంతిమ యాత్ర షెడ్యూల్ ఫిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే నెల జూలై 4 నుంచి రాజధాని టెహ్రాన్‌లో అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో 86 ఏళ్ల ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగడంతో, మార్చిలో జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఇటీవలే ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య తాత్కాలిక సంధి కుదరడంతో ఇప్పుడు అంత్యక్రియల నిర్వహణకు మార్గం సుగమమైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

అంత్యక్రియల షెడ్యూల్ వివరాలు..

జూలై 4 - 6 వరకు రాజధాని టెహ్రాన్‌లో అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని మూడు రోజుల పాటు అక్కడే ఉంచుతారు. జూలై 7 వ తేదీన పవిత్ర నగరం ‘కోమ్’ (Qom) లో ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 9 న ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని ప్రసిద్ధ ‘ఇమామ్ రెజా ష్రైన్’ వద్ద అంతిమ ఖనన సంస్కారాలు పూర్తి చేస్తారు. 1989లో ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఇరాన్ సైనిక, పారామిలటరీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా భావిస్తున్న కుమారుడు మోజ్తబా ఖమేనీ తెర వెనుక ఉండి అమెరికాతో జరుగుతున్న చర్చల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల పేర్కొన్నారు.

Next Story