FSSAI: పండ్ల పక్వానికి అనుసరించే పద్దతిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన ఆదేశాలు

by S Gopi |   (  Updated:2025-05-20 13:06:06  IST  )

కాల్షియం కార్బైడ్ వంటి పదార్థాలను పండించడానికి ఉపయోగిస్తున్న వాటిపై తనిఖీలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది

FSSAI: పండ్ల పక్వానికి అనుసరించే పద్దతిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పండ్లను పండించేందుకు వాడుతున్న సింథటిక్ రంగులకు సంబంధించి తనిఖీలను ముమ్మరంగా చేపట్టాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధంగా పండ్ల పక్వానికి సింథటిక్ పూత, రంగులను ఉపయోగించడాన్ని నివారించేందుకు క్యాంపెయిన్ నిర్వహించాలని స్పష్టం చేసింది. పండ్ల మార్కెట్లు, మండీలలో నిఘా పెంచాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. కాల్షియం కార్బైడ్ - సాధారణంగా 'మసాలా' అని పిలుస్తారు - వంటి ప్రమాదకరమైన పదార్థాలను కృత్రిమంగా పండ్లను పండించడానికి ఉపయోగించడాన్ని నిరోధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆహార భద్రత కమిషనర్లను ఆదేశించింది. గోడౌన్లు, నిల్వ కేంద్రాల తనిఖీ, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి పదార్థాలను పండించడానికి ఉపయోగిస్తున్నట్లు అనుమానం ఉన్న వాటిపై తనిఖీలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. పండ్ల సరుకుల దగ్గర లేదా నిల్వ చేసిన ప్రదేశంలో కాల్షియం కార్బైడ్ ఉంటే గనక, సంబంధిత వ్యాపార నిర్వాహకులపై ఆహార భద్రత, ప్రమాణాలు (ఎఫ్ఎస్ఎస్) చట్టం, 2006 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, పరిమితులు) నిబంధనలు, 2011 ప్రకారం కాల్షియం కార్బైడ్ వాడటాన్ని నిషేధించారు. ఈ రసాయనం కారణంగా నోటి పూత, జీర్ణ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ కారకాల ప్రభావాలతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సురక్షితమైన పండ్లను పండించే పద్ధతులను నిర్ధారించడానికి వ్యాపారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠినంగా సూచనలు జారీ చేసింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు తప్పవని స్పష్టం చేసింది.

Next Story