- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాకుల నీడ నుంచి ప్రగతి బాటలోకి.. అబూజ్‌మాడ్‌లో కలెక్టర్ ‘బైక్’ రైడ్
మావోయిస్టుల కంచుకోట అబూజ్‌మాడ్ కొండల్లో లేడీ కలెక్టర్ పర్యటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అడవుల్లో బైక్‌పై, కాలినడకన తిరుగుతూ ఆదివాసీల కోసం సర్వే చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్దాలుగా మావోయిస్టులకు స్థావరంగా, ప్రభుత్వ రికార్డుల్లో సర్వే ఆఫ్ ఇండియా(Survey of India) సర్వే చేయని, మ్యాప్‌లలో కనిపించని అజ్ఞాత గ్రామాలుగా ఉన్నచోట ఇప్పుడొక చారిత్రక పరిణామం జరుగుతోంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సుప్రసిద్ధ ఆంత్రొపాలజిస్ట్(Anthropologist) (మానవ విజ్ఞాన శాస్త్రవేత్త) హైమన్ డార్ఫ్(Hyman Dorf) సందర్శన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అక్కడి గ్రామాలకు చేరుకుంటోంది. గ్రామాల సర్వే మ్యాపులు తయారు చేయడం, నివాసాల వివరాలు సేకరించడం, ఆధార్ కార్డులు జారీ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సాక్షాత్తూ నారాయణపూర్ జిల్లా (Narayanpur District Collector) కలెక్టర్ నమ్రత జైన్ (Collector Namrata Jain) స్వయంగా మోటార్ సైకిల్ ఎక్కి అడవుల బాట పట్టడం అక్కడ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకాలం మావోయిస్టుల తుపాకుల నీడలో బతికిన ఆదివాసీ గ్రామాల్లోకి అధికారులు చొచ్చుకెళుతున్నారు.
అడ్డంకులు దాటి.. ఆదివాసీల చెంతకు..
అబూజ్‌మాడ్(Abusmad) అంటే గోండి భాష(Gondi language)లో 'తెలియని కొండలు' అని అర్థం. పేరుకు తగ్గట్టే ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సర్కారు రికార్డులకు చిక్కలేదు. కలెక్టర్ నమ్రత జైన్ నేతృత్వంలోని బృందం గత వారం సాహసోపేతమైన పర్యటన చేపట్టింది. బురద బాటలు, వాగులు, కొండ కోనలను దాటుకుంటూ ఆమె బైక్‌పై ప్రయాణించారు. దారి లేని చోట కాలినడకన వెళ్లి మారుమూల ఆదివాసీలను పలకరించారు. వీరికి ప్రభుత్వం అంటే ఏమిటో, సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశారు.
కూలిన మావోయిస్టుల కోట!
ఒకప్పుడు అబూజ్‌మాడ్ అంటే మావోయిస్టుల 'సెంట్రల్ గెరిల్లా బేస్’(ప్రధాన గెరిల్లా స్థావరం). అక్కడికి వెళ్లాలంటే పోలీసులకైనా, అధికారులకైనా వణుకు పుట్టేది. మావోయిస్టుల జనతన సర్కార్లు(సమాంతర సర్కార్) అక్కడ హవా నడిపించేవి. కంప్యూటర్లు, ప్రింటర్లతో పక్కాగా నెట్‌వర్క్ నడిపేవారు. మావోయిస్టు పత్రికలు, ప్రచురణలు, మిలిటరీ శిక్షణ, రాజకీయ తరగతులు, నాయకత్వ కమిటీల సమావేశాలు అన్నీ అక్కడే నడిచేవి. అయితే, గత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఇతర నేతల మరణం, ఆయుధాలతో సహా వేల మంది లొంగుబాటు అడవిలో పోలీసు క్యాంపుల ఏర్పాటుతో సీన్ మారింది. మావోయిస్టుల పట్టు సడలడంతో ఇప్పుడు సివిల్ యంత్రాంగం ధైర్యంగా లోపలికి వెళ్తోంది.
మ్యాపింగ్‌లో విస్తుపోయే విషయాలు..
ఐఐటీ రూర్కీ(IIT Roorkee) సహకారంతో చేపట్టిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి:
- ఇప్పటివరకు 412 గ్రామాలను మ్యాపింగ్ చేయగా, 377 చోట్ల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు.
- కొన్ని గ్రామాల్లో కేవలం 5 నుంచి 6 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా కేంద్రం నారాయణపూర్‌కు ఇవి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
- సర్వే బృందానికి తారసపడిన ఆదివాసీలు పురాతన ఆచారాలతో కనిపించారు. పూలతో అలంకరించిన తలపాగలు ధరించడం, ఆహార ధాన్యాలను బయటే ఉంచి పూజించడం, విల్లు బాణాలతో వేట సాగించడం వంటివి అధికారులను ఆశ్చర్యపరిచాయి.
గుర్తింపు కార్డుల వేట
"నా స్వస్థలం బస్తర్(Bastar) కావడంతో ఈ ప్రాంతంపై నాకు కొంత అవగాహన ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ గ్రామాల గురించి కేవలం మాటల్లోనే విన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం" అని కలెక్టర్ నమ్రత జైన్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం వీరికి ఆధార్ కార్డులు ఇచ్చి, రేషన్, ఆరోగ్యం వంటి కనీస వసతులు కల్పించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాదే జాతీయ జనగణన (Census) జరుగుతున్న నేపథ్యంలో, అబూజ్‌మాడ్ బిడ్డలను కూడా అధికారిక రికార్డుల్లో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.






