US Deportee: అడవుల్లో, కాలువల్లో పాములు, మొసళ్లు దాటుకుంటూ.. డంకీ రూట్లలోని కష్టాలివే..

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమవలసదారులను బహిష్కరిస్తున్నారు.

US Deportee: అడవుల్లో, కాలువల్లో పాములు, మొసళ్లు దాటుకుంటూ.. డంకీ రూట్లలోని కష్టాలివే..
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమవలసదారులను బహిష్కరిస్తున్నారు. ఏజెంట్లను నమ్మి డంకీ రూట్లలో ఎంతోమంది భారతీయులు అమెరికా వలసవెళ్తున్నారు. అలాంటి వారిని ప్రత్యేక విమానాల ద్వారా వందలాది మంది భారతీయులను స్వదేశానికి పంపిస్తున్నారు. అయితే, ఇటీవలే స్వదేశానికి వచ్చిన పంజాబీ యువకుడు మన్ దీప్ సింగ్ డంకీ రూట్లలో ఎదుర్కొన్న భయానక పరిస్థితులను మీడియాకు వివరించాడు. అమెరికా వెళ్లడానికి తాను ఓ ఏజెన్సీని సంప్రదించగా చట్టపరంగా తీసుకెళ్తానని నమ్మించి రూ.40లక్షలు వసూలు చేశారని ఆవేదన చెందాడు. తర్వాత డంకీ రూట్లలో తనను ప్రమాదకరమైన మార్గాల్లో తీసుకెళ్లినట్లు తెలిపారు. మొదట అమృత్‌సర్‌ నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి ముంబై, నైరోబీ, ఆమ్‌స్టర్‌డామ్‌ మీదుగా సురినామ్‌ చేరుకున్నట్లు తెలిపాడు. అక్కడ తనలాంటి చాలా మందిని చిన్నవాహనంలో ఎక్కించి గయానాకు తీసుకెళ్లినట్లు వివరించాడు. ఆ దారుల్లో తిండితిప్పలు లేకుండా రోజుల తరబడి ప్రయాణించామన్నారు. గయానా, బొలివీయా దాటి ఈక్వెడార్ నుంచి పనామా అడవులు చేరుకున్నామన్నారు. పనామా అడవుల్లో, కాలువల్లో ప్రమాదకర పాములు, మొసళ్లను దాటుకుంటూ తమ ప్రయాణం సాగిందని పేర్కొన్నాడు. దీని గురించి ప్రశ్నిస్తే కాల్చి చంపేస్తామని ఏజెంట్‌ బెదిరించారన్నాడు. అలా రోజుకు 12 గంటలు నడుస్తూనే ఉండేవాళ్లమని తెలిపాడు. కెన్యా, నెదర్లాండ్స్‌, గయానా, సురినామ్‌, కొలంబియా, పనామా, నికరగ్వా దేశాల మీదుగా అమెరికా చేరుకున్నట్లు తెలుపుతూ.. ప్రయాణానికి సంబంధించిన పలు వీడియోలను చూపించాడు.

చివరికి అమెరికా వెళ్తే..

చివరికి జనవరి 27న మెక్సికోలోని టిజువామానాకు చేరుకున్నట్లు మన్ దీప్ సింగ్ వెల్లడించాడు. ఎన్నో కష్టాల తర్వాత అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బోర్డర్ పెట్రోల్ అధికారులు తనను అరెస్టు చేసినట్లు తెలిపాడు. తనని బహిష్కరిస్తారని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు నిర్బంధ కేంద్రంలో ఉంచారన్నాడు. మూడో విడతలో భాగంగా 112 మంది భారతీయులు ఆదివారం రాత్రి 10 గంటలకు అమెరికా సైనిక విమానంలో అమృత్‌సర్‌ చేరుకున్నారు. అందులోనే మన్ దీప్ సింగ్ ఉన్నాడు. అంతకుముందు రెండు దఫాల్లో 116 మందిని, 104 మందిని భారత్ తీసుకువచ్చారు.

Next Story