- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
PM Modi: ప్రధాని మోడీ 3.0.. మొదటి 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలివే
దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టారు. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఇతర పార్టీల మద్దతుతోనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీతో ప్రధానిగా మోడీ తన మూడో టర్మ్‌లో 100 రోజులను పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 9న భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వంద రోజుల్లో రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు, కార్యక్రమాలను అమలు చేశారు. తొలి నిర్ణయంగా ప్రధాని మోడీ కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకానికి సంబంధించిన 17వ విడతను విడుదల చేశారు. ఈ పథకం కింద 9.3 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లను పంపిణీ చేశారు. మొత్తంగా వివిధ మార్గాల్లో ఇప్పటివరకు 12.33 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు 2024-25 సంవత్సరానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని పెంచారు. దీనివల్ల రైతులకు సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇదే సమయంలో రూ. 12,100 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
వ్యవసాయ రంగంలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంచేందుకు రూ. 14,200 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌తో సహా ఏడు పథకాలను ఆమోదించారు. కొత్త జాతీయ సహకార విధానానికి సంబంధించిన ముసాయిదా విధానం కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది చివరి దశలో ఉన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. అలాగే, ఉత్తరాఖండ్ రైతుల నుంచి వారు సూచించిన ధరలకు సేంద్రీయ ఉత్పత్తులను కొనేందుకు నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్‌సీఓఎల్), ఉత్తరాఖండ్ ఆర్గానిక్ కమోడిటీ బోర్డ్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. దీని ద్వారా లాభాల్లో సముచిత వాటా నేరుగా రైతుల ఖాతాల్లో జమకానుంది. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ని తొలగించి, రైతులకు మేలు చేసే అవకాశం ఉన్న ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం రూ. 3,300 కోట్లతో అనేక వ్యవసాయ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించింది. మొదటి 100 రోజుల్లో ప్రధానమంత్రి అభివృద్ధి చేసిన గిరిజన గ్రామం అభియాన్ కింద 63,000 గిరిజన గ్రామాల అభివృద్ధి, 5 కోట్ల గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు నిర్ణయం. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది జూన్‌లో మొదటి వారణాసి పర్యటన సందర్భంగా.. వ్యవసాయంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 30,000 మంది 'కృషి సఖి'లను ప్రధాని మోడీ సత్కరించారు. వెదర్ అండ్ క్లైమెట్‌ను తట్టుకోగల భారత్ కోసం కేంద్రం రూ. 2,000 కోట్ల 'మిషన్ మౌసమ్'ను ఆమోదించింది. దీనితో పాటు, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, స్టార్టప్‌లు, గ్రామీణ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా 'అగ్రిసూర్' పేరుతో కొత్త ఫండ్‌ను కేంద్రం ప్రారంభించింది. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 75,000 అదనపు మెడికల్ సీట్లను తీసుకొచ్చారు. సైబర్ నేరాల నుంచి భద్రతకు 'సమన్వయ' పేరుతో కొత్త వ్యవస్థను రూపొందించారు. వచ్చే ఐదేళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలతో ఈ వ్యవస్థను పటిష్ఠం చేయనున్నారు.
మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీని కల్పిస్తూ కేంద్ర బడ్జెట్‌లో రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వేతనజీవులు రూ. 17,500 వరకు పన్నులను ఆదా చేయవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75,000కు పెంచడం, ఫ్యామిలీ పెన్షన్ మినహాయింపు పరిమితిని రూ.25 వేలకు పెంచే నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఆదాయపు పన్ను నిబంధనలను సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఆరు నెలల్లోగా సమగ్ర సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏంజెల్ టాక్స్‌ను రద్దు చేయడం, కార్పొరేట్ పన్నును తగ్గించడమే కాకుండా, స్పేస్ సెక్టార్‌లో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి రూ.1000 కోట్లతో వెంచర్ కేపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. టైర్-2, టైర్-3 నగరాల్లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి జెన్-నెక్స్ట్ ఇన్నోవేషన్ స్టార్టప్‌ల (జెనెసిస్) ప్రోగ్రామ్‌ను ఆమోదించారు. మొదటి 100 రోజుల్లో యువతలో ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి రూ. 2 లక్షల కోట్ల పీఎం ప్యాకేజీని ప్రకటించారు. మొదటి 100 రోజుల్లో మహిళా సాధికారత కోసం ప్రధాని మోడీ 11 లక్షల మంది కొత్త లఖపతి దీదీలకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పుడు 1 కోటి మందికి పైగా లఖపతి దీదీలు సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అలాగే, ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) ద్వారా 25 సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రభుత్వోద్యోగులు వారి సగటు మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌గా పొందే నిర్ణయం తీసుకున్నారు. 'ఒక ర్యాంక్, ఒకే పెన్షన్' పథకాన్ని భద్రతా దళాలు, వారి కుటుంబాల కోసం అమలు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్బన్ ప్రాంతాల్లో కోటి ఇళ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 'ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద, జూన్-ఆగస్టు మధ్య 2.5 లక్షల ఇళ్లలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. పీఎం ఈ-బస్ సర్వీస్ ద్వారా పర్యావరణ అనుకూల ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ. 3,400 కోట్ల వ్యయంతో ఈ-బస్సుల కొనుగోలును ఆమోదించారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, వాయుమార్గాలపై ప్రాథమిక దృష్టి సారించి మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం 100 రోజుల్లో రూ. 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.