ఫిట్‌నెస్ ఫస్ట్ : ముంబై వీధుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు సాధారణ పౌరుడిలా జాగింగ్.. వైరల్

by Ramesh Naini |

దౌత్యపరమైన బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ జాగింగ్ చేస్తూ కనిపించారు.

ఫిట్‌నెస్ ఫస్ట్ : ముంబై వీధుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు సాధారణ పౌరుడిలా జాగింగ్.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' (AI Impact Summit) లో పాల్గొనేందుకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, మంగళవారం ఉదయం ముంబై వాసులను ఆశ్చర్యపరిచారు. దౌత్యపరమైన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ఆయన తన ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ముంబై రోడ్లపై జాగింగ్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మెక్రాన్ చర్చ్‌గేట్, మెరైన్ డ్రైవ్ పరిసరాల్లో జాగింగ్ చేశారు. నేవీ బ్లూ టీ-షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి ఆయన సాధారణ పౌరుడిలా పరుగెత్తుతుండగా, ఫ్రెంచ్, భారతీయ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. కోస్టల్ రోడ్డులో ఆయన జాగింగ్‌ను చూసి స్థానికులు ఆసక్తిగా గమనించారు. మరోవైపు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భద్రతా సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

26/11 బాధితులకు నివాళులు..

జాగింగ్ అనంతరం, మెక్రాన్ తన సతీమణి బ్రిగిట్టే మెక్రాన్‌తో కలిసి దక్షిణ ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను సందర్శించారు. 2008 నవంబర్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు వారు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం 'X' లో స్పందిస్తూ.. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఐక్యత, దృఢ సంకల్పంతోనే ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు..

అనంతరం ముంబైలోని లోక్ భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో మెక్రాన్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని చర్చలు ప్రారంభించారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, రక్షణ, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో సహకారంపై వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది.

Next Story