పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి అరెస్ట్.. కోడిగుడ్లతో దాడి చేసిన స్థానికులు

by Ramesh Naini |

ప్రభుత్వ సహాయక సామగ్రి దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి అరెస్ట్.. కోడిగుడ్లతో దాడి చేసిన స్థానికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ సహాయక సామగ్రి దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్‌ను మంగళవారం (జూన్ 9) రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉజ్జల్ బిస్వాస్ నివాసంలో టార్పాలిన్లు, ధోతీలు, చీరలు వంటి ప్రభుత్వ సహాయక సామాగ్రిని అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటిపైకి దూసుకెళ్లారు.

కోడిగుడ్లతో దాడి...

ఆగ్రహించిన నిరసనకారులు ఆయన ఇంట్లోకి చొరబడి తీవ్ర నినాదాలు చేస్తూ, మాజీ మంత్రి ముఖంపై కోడిగుడ్లు విసిరారు. దాదాపు గంటపాటు ఆయనను ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బిస్వాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ ఖరారు చేశారు. ఈ క్రమంలో కోర్టు వెలుపల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కుటుంబ సభ్యుల వివరణ..

ఈ ఆరోపణలను ఉజ్జల్ బిస్వాస్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. సదరు సామాగ్రి ప్రజలకు పంపిణీ చేయడం కోసం అధికారికంగా కేటాయించినదేనని.. పంపిణీ కాగా మిగిలిపోయిన వస్తువులను తిరిగి తీసుకెళ్లాల్సిందిగా ఇప్పటికే తాము జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించామని వారు స్పష్టం చేశారు.

రాజకీయ దుమారం..

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై వరుస చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల మున్సిపల్ నియామకాల కుంభకోణంలో మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్ కాగా, దుర్గాపూజ నిధుల వ్యవహారంలో మాజీ మంత్రి ఇంద్రాణిల్ సేన్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఉజ్జల్ బిస్వాస్ అరెస్ట్ కావడం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ కలకలానికి దారితీసింది.

Next Story