కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కబీంద్ర పుర్కాయస్థ కన్నుమూత

by Malleboina Mahesh |

ఈశాన్య భారతంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఎదుగుదలకు మూలస్తంభం గా నిలిచిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కబీంద్ర పుర్కాయస్థ (94) కన్నుమూశారు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కబీంద్ర పుర్కాయస్థ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య భారతంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఎదుగుదలకు మూలస్తంభం గా నిలిచిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కబీంద్ర పుర్కాయస్థ (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, అసోంలోని సిల్చార్‌లో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, అసోంలో బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను అసోం బీజేపీ పితామహుడిగా పార్టీ శ్రేణులు గౌరవిస్తాయి.

వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా

కబీంద్ర పుర్కాయస్థ రాజకీయ ప్రస్థానం ఎంతో ఘనమైనది. సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆయన మూడుసార్లు (1991, 1998, 2009) ఎంపీగా విజయం సాధించారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో (1998-1999) కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు. 1931లో నాటి అవిభక్త భారతదేశంలోని సిల్హెట్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో జన్మించిన ఆయన, రాజకీయాల్లోకి రాకముందు అధ్యాపకుడిగా సేవలందించారు.

ప్రధాని మోడీ, సీఎం బిశ్వ శర్మ సంతాపం

కబీంద్ర పుర్కాయస్థ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈశాన్య భారత రాజకీయాల్లో ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. కబీంద్ర పుర్కాయస్థకు కుమారుడు కనద్ పుర్కాయస్థ ఉన్నారు, ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. పుర్కాయస్థ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Next Story