నిర్మలా సీతారామన్‌ స్థానంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్? కేబినెట్‌లో భారీ మార్పులు?

by Ramesh Naini |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి జరగనున్న నేపథ్యంలో.. అంతకుముందే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని ఎన్డీయే సర్కారు భావిస్తోంది.

నిర్మలా సీతారామన్‌ స్థానంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్? కేబినెట్‌లో భారీ మార్పులు?
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి జరగనున్న నేపథ్యంలో.. అంతకుముందే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని ఎన్డీయే సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అధిష్టానం కీలక భేటీలు నిర్వహించింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును సైతం ఇటీవలే ప్రధాని మోడీ, అమిత్ షా వేరువేరుగా కలిసి కేబినెట్ మార్పులపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, పీఎంకు కీలక సలహాదారుగా ఉన్న శక్తికాంత దాస్‌కు కీలక బాధ్యతలు అందిస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం తదితర పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచాలనే ఆలోచనతోనే ఆర్థికశాఖను ‘దాస్‌’కు అప్పగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు తెలియజేశాయి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థానంలో ఆయనకు ఫైనాన్స్ మినిస్ట్రీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ఆర్థిక బాధ్యతలు చూసుకున్న నిర్మలకు విద్యాశాఖ అందజేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మరోశాఖ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

ఆరేళ్లు ఆర్బీఐ గవర్నర్‌..

ఆరేళ్లు ఆర్బీఐ గవర్నర్‌గా ఉండటంతో పాటు పలు కీలక ఆర్థిక విధానాల రూపకల్పనలో పీఎంవో సభ్యుడిగా శక్తికాంత దాస్‌కు అపార అనుభవం సంపాదించారు. ప్రభుత్వ వర్గాల్లో ‘మిస్టర్ డిపెండబుల్’గా పేరొందిన ఆయన.. అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొని భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలిగే సమర్థుడని ఎన్డీయే సర్కారు భావిస్తోంది. గ్లోబల్ వాణిజ్యంలో ఉన్న సమస్యలు, ట్రంప్ వేస్తున్న సుంకాలతో పాటు ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరిగేలా చూడటం, ఆర్థిక లోటును పూడ్చటం, గ్లోబల్ షాక్‌ల వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం తదితర సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్థికవేత్తగా ఎంతో అనుభవం ఉన్న శక్తికాంత దాస్‌ సరైన వ్యక్తి అని ప్రధాని మోడీ అనుకుంటున్నారని, అందుకే ఆయన్ను ఎంపిక చేశారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

కీలక పదవి ఇవ్వడం వెనుక..

శక్తికాంతదాస్‌కు ఈ కీలక పదవి ఇవ్వడం వెనుక ఆయన ట్రాక్ రికార్డు కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. వివిధ స్థాయిల్లో 8 కేంద్ర బడ్జెట్‌లు సిద్ధం చేయడంలో శక్తికాంత దాస్ పాల్గొన్నారు. అలాగే ఆర్బీఐ 25వ గవర్నర్‌గా ఆయన ఉన్నప్పుడే కొవిడ్-19 సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేసింది. అలాంటి కష్టకాలంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకున్నాయి. ఇక మోడీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ, ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) చట్టాలు తెచ్చిన సమయంలో ఎకనామిక్ అఫైర్స్ సెక్రెటరీగా ఉన్న దాస్.. ఈ విధానాలు స్మూత్‌గా అమలయ్యేలా చూసేందుకు ఎంతో కృషిచేశారు. జీ 20 లో భారత రాయబారిగా కూడా సేవలందించిన ఆయన.. అంతర్జాతీయంగా ఎంతో మెప్పు పొందడంతోపాటు ప్రతిష్టాత్మక ‘సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా పలుమార్లు అందుకున్నారు.

పీవీ తరహా నిర్ణయం..

1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆనాడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కరంగా ఉండటంతో నాటి ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిని చేశారు. ఈ సాహసోపేత నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా మారిందో అందరికీ తెలిసిందే. అదే ఆలోచనతో మోడీ కూడా శక్తికాంత దాస్‌ను ఎంపిక చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తోడు నమ్మకస్తులైన బ్యూరోక్రాట్లను మంత్రివర్గంలో తీసుకునే అలవాటు మోడీకి మొదటి నుంచి ఉన్నదే. విదేశాంగ మంత్రి జైశంకర్ అలా వచ్చినవారే. ఇప్పుడు శక్తికాంత దాస్‌ను కూడా ఈ తరహాలోనే తన కేబినెట్‌లో చేర్చుకుంటారని సమాచారం. యూపీ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

Next Story