- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NSG తొలి డైరెక్టర్ జనరల్ ఆర్.టి.నాగ్రాని కన్నుమూత
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) మొదటి డైరెక్టర్ జనరల్, సీనియర్ అధికారి ఆర్.టి.నాగ్రాని (98) ఢిల్లీలో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) మొదటి డైరెక్టర్ జనరల్, 1986లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి సాయుధ ఉగ్రవాదులను బయటకు పంపడానికి చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ థండర్-1'కి నాయకత్వం వహించిన సీనియర్ అధికారి ఆర్.టి.నాగ్రాణి (98) ఆదివారం ఢిల్లీలో కన్నుమూశారు. దక్షిణ ఢిల్లీలోని ఆయన నివాసంలో వయోభారంతో, అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1951 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన నాగ్రాని, 1987లో సర్వీస్ నుంచి విరమణ పొందారు.
‘బ్లాక్ క్యాట్స్’ కమాండో బలగంగా గుర్తింపు పొందిన ఎన్‌ఎస్‌జీకి నాగ్రాని 1984 ఆగస్టు 17 నుండి 1986 సెప్టెంబర్ 25 వరకు అధిపతిగా సేవలు అందించారు. ఉగ్రవాద నిరోధక, విమానాల హైజాక్ నిరోధక, బందీల విమోచన చర్యలను సమర్థవంతంగా చేపట్టే లక్ష్యంతో 1984లో ఎన్‌ఎస్‌జీ రూపుదిద్దుకుంది. అధికారిక నివేదికల ప్రకారం.. 1986 ఏప్రిల్ 30 రాత్రి స్వర్ణ దేవాలయంలో 'ఆపరేషన్ బ్లాక్ థండర్-1' ప్రారంభమై మరుసటి రోజు ఉదయానికి పూర్తయింది. స్వర్ణ దేవాలయ పవిత్రతను కాపాడుతూ, సైనికులు తలకు గుడ్డ కట్టుకుని, పట్టి ఖాళీ కాళ్లతోనే ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగకుండా, ఎన్‌ఎస్‌జీ బలగాలు 122 మంది అనుమానితులను అరెస్టు చేశాయి.
నాగ్రాని మృతి పట్ల ఎన్‌ఎస్‌జీ ప్రస్తుత (25వ) డైరెక్టర్ జనరల్ భృగు శ్రీనివాసన్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రపంచంలోనే సాటిలేని ఒక విశిష్టమైన బలగాన్ని నాగ్రాని తీర్చిదిద్దారని ప్రశంసించారు. "వ్యవస్థాపక పితామహుడు నేర్పిన విలువలు, సిద్ధాంతాలే నేడు మన ఎలైట్ బలగానికి పునాదిగా నిలిచాయి. ఆయన లాంటి మహనీయుల అడుగుజాడల్లోనే మేం నడుస్తున్నాం" అని పేర్కొన్నారు.






