కొడుకు సమాధి వద్ద కన్నీరుమున్నీరైన మాజీ మిస్ ఇండియా.. భర్తపై సంచలన ఆరోపణలు!

by Ramesh Naini |

బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్ర విషాదాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

కొడుకు సమాధి వద్ద కన్నీరుమున్నీరైన మాజీ మిస్ ఇండియా.. భర్తపై సంచలన ఆరోపణలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్ర విషాదాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో, తన భర్త పీటర్ హాగ్.. తన పిల్లలను కలవనివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయిన తన కుమారుడు షంషేర్ సమాధి వద్ద ఆమె కన్నీరుపెట్టుకుంటున్న ఒక భావోద్వేగ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు ఉమ్మడి కస్టడీకి (Joint Custody) ఆదేశించినప్పటికీ, తన ముగ్గురు పిల్లలతో కనీసం మాట్లాడే అవకాశం కూడా తన భర్త ఇవ్వడం లేదని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను రహస్య ప్రదేశానికి తరలించారని, వారి మనసు మార్చి తనపైకి ఉసిగొల్పుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతానికి తాను కలవగలిగిన ఒకేఒక్క బిడ్డ.. చనిపోయిన తన కొడుకు షంషేర్ మాత్రమేనని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

భర్త కెరీర్ కోసమే..

భర్త కెరీర్ కోసం తాను దేశాన్ని, తల్లిదండ్రులను, సినిమా అవకాశాలను వదులుకుని దుబాయ్, సింగపూర్, ఆస్ట్రియా లాంటి దేశాలు తిరిగానని సెలీనా తెలిపారు. తన భర్తకు అన్ని విధాలా అండగా నిలబడినా, చివరకు తాను గృహహింసకు గురయ్యానని వాపోయారు. తాను సామరస్యపూర్వకంగా విడిపోవాలని భావిస్తుంటే.. తన భర్త మాత్రం వివాహానికి ముందు తన పేరిట ఉన్న ఆస్తులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన స్వేచ్ఛను హరిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. గృహహింస, వేధింపుల కింద నవంబర్ 2025లో ముంబైలోని అంధేరి కోర్టులో ఆమె విడాకులకు దరఖాస్తు చేశారు.

తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితమే!

కాగా, 2001లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న సెలీనా జైట్లీ, 2003లో ‘జాన్షీన్’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అలాగే తెలుగు ఆడియెన్స్‌కు కూడా పరిచయమే. మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాలో హీరోయిన్‌గా చేశారు. అయితే, ఆమె 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్నారు. 2012లో ఈ దంపతులకు కవలలు (విన్స్టన్, విరాజ్) జన్మించారు. తిరిగి 2017లో మరో ఇద్దరు కవలలకు (ఆర్థర్, షంషేర్) జన్మనివ్వగా, వారిలో షంషేర్ అనే బాబు గుండె సంబంధిత సమస్యతో మరణించాడు. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా కనిపించిన వీరి వైవాహిక జీవితం ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుండటం అభిమానులను కలచివేస్తోంది.

Next Story