కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి.. అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |   (  Updated:2025-10-15 10:25:17  IST  )

కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా బుధవారం ఉదయం కేరళలో మరణించారు.

కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి.. అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కెన్యా మాజీ ప్రధాని (Kenya former Prime Minister) రైలా ఒడింగా (Raila Odinga) బుధవారం ఉదయం కేరళలో మరణించారు. ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళంలో మార్నింగ్ వాక్ చేస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. 80 ఏళ్ల రైలా ఓడింగా కొంత కాలంగా కంటి చూపు సమస్యతో భాధపడుతున్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ఆరు రోజుల క్రితం తన కుమార్తె, సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని (Kerala) కూతట్టుకుళంకు వచ్చారు. అక్కడ ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆసుపత్రి ఆవరణంలో మార్నింగ్ వాక్‍కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించినా తుది శ్వాస విడించారు. ఒడింగా మరణించిన విషయాన్ని కేరళ ప్రభుత్వం ఢిల్లీలోని కెన్యా రాయబారి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది.

ఆధునిక కెన్యా ప్రజాస్వామ్య రూపశిల్పి:

నాలుగు దశాబ్దాలకు పైగా కెన్యా రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తిగా కొనసాగిన రైలా ఒడింగా రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకుల మధ్య సాగింది. లువో తెగకు చెందిన ఆయన 1992లో కెన్యా పార్లమెంటులోకి తొలిసారి ప్రవేశించారు. 2008 నుంచి 2013 వరకు కెన్యాలో జాతీయ సయోధ్య, రాజ్యాంగ సంస్కరణల కీలకమైన కాలంలో ప్రధాన మంత్రిగా పని చేశారు. ఆధునిక కెన్యా ప్రజాస్వామ్యాన్ని రూపొందించిన వారిలో ఆయన కీలక వ్యక్తి. ఒడింగా చాలా కాలంగా ప్రతిపక్ష నాయకుడిగా మరియు ఆరెంజ్ డెమోక్రటిక్ ఉద్యమ అధిపతిగా కూడా ఉన్నారు. ఎనిమిది సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపారు.

ప్రధాని మోడీ సంతాపం:

రైలా ఒడింగా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒడింగా మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నా ప్రియ మిత్రుడు, కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి ఎంతో ఇష్టమైన స్నేహితుడు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనను దగ్గరగా తెలుసుకునే అదృష్టం నాకు లభించింది. నాటి నుంచి మా అనుబంధం సంవత్సరాలుగా కొనసాగింది అంటూ ట్వీట్ చేశారు.

Read More: నా ప్రియ మిత్రుడి మరణం చాలా బాధ కలిగించింది: ప్రధాని మోడీ

Next Story