ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్ కె కస్తూరి రంగన్ కన్నుమూత

by S Gopi |

ఇస్రో అధిపతిగా డాక్టర్ కస్తూరిరంగన్ ఉన్నప్పుడే భూమి కక్ష్యకు వెలుపల భారత తొలి యాత్ర చంద్రయాన్-1 రూపకల్పన జరిగింది

ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్ కె కస్తూరి రంగన్ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ శుక్రవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తొమ్మిదేళ్లపాటు ఇస్రో, స్పేస్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు నాయకత్వం వహించిన కస్తూరి రంగన్, 2003 ఆగస్టు 27న పదవి నుంచి వైదొలిగారు. ఆయన హయాంలో రెండు రాకెట్లు నిర్వహణ దశలోకి వచ్చాయి. ఇస్రో అధిపతిగా డాక్టర్ కస్తూరిరంగన్ ఉన్నప్పుడే భూమి కక్ష్యకు వెలుపల భారత తొలి యాత్ర చంద్రయాన్-1 రూపకల్పన జరిగింది. అప్పటికి దానికి సోమయాన్ అని పేరు పెట్టారు. 1940, అక్టోబర్ 24న ఎర్నాకులంలో జన్మించిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గౌరవాలను పొందారు. మాజీ రాజ్యసభ సభ్యుడిగా 2003-2009 మధ్య పనిచేశారు. నూతన విద్యా విధానం-2020 రూపకల్పనకు నాయకత్వం వహించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా ప్రణాళికా సంఘం సభ్యుడిగా, 2004-2009 మధ్య బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. 1990-1994 మధ్య యూఆర్ఏసీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 1994 నుంచి 2003 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. కస్తూరి రంగన్ మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన నిస్వార్థ సహకారం, లీడర్‌షిప్‌ని దేశం ఎన్నడూ మరవదని, భారత అంతరిక్ష రంగాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చారని తెలిపారు.

Next Story