కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం రూ.500 కోట్లు.. మాజీ క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్!

by Phanindra |

కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం రూ.500 కోట్లు అందించాలని, ఆ డబ్బు తమ వద్ద లేదని మాజీ క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం రూ.500 కోట్లు.. మాజీ క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తన భర్త నవజోత్ సింగ్ సిద్ధూ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆయన భార్య నవజోత్ కౌర్ వెల్లడించారు. సీఎం సీటు కోసం పార్టీకి డబ్బులిచ్చే తాహతు తమకు లేదని, కానీ సీఎం పదవినిస్తే పంజాబ్‌ను ‘బంగారు రాష్ట్రం’గా మారుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ‘మేం ఎప్పుడూ పంజాబ్ సంప్రదాయాల గురించి మాట్లాడతాం. కానీ సీఎం సీటు కోసం రూ.500 కోట్ల సూట్‌కేసులు ఇవ్వడం మా వల్ల కాదు’ అని ఆమె చెప్పారు. గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిసి, పంజాబ్‌లో దిగజారుతున్న లా అండ్ ఆర్డర్ సమస్య సహా ఇతర అంశాలపై చర్చించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే నిజంగా ఎవరైనా సీఎం సీటు కోసం డబ్బులు అడిగారా అని ప్రశ్నించగా.. ‘బహిరంగంగా ఎవరూ అడగరు. కానీ రూ.500 కోట్ల సూట్ కేసు ఇచ్చిన వాళ్లే సీఎం అవుతారు’ అని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే ఏ పార్టీ అయినా సరే పంజాబ్‌ను మెరుగు పరిచేందుకు సీఎం అధికారాన్ని ఇస్తే.. నవజోత్ సింగ్ సిద్ధూ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ఆమె చెప్పారు. తాము డబ్బులివ్వలేకపోయినా, ఒక్క అవకాశం ఇస్తే పంజాబ్‌ను సుసంపన్న రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇక పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు దారుణంగా ఉన్నాయన్న ఆమె.. ఇప్పటికే రాష్ట్రంలో ఐదుగురు నేతలు సీఎం పదవి కోసం కొట్లాడుకుంటున్నారని, సిద్ధూ ముందుకు రాకుండా వాళ్లే తొక్కేస్తున్నారని ఆమె ఆరోపించారు.

తన భర్తకు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో మంచి సంబంధాలున్నాయని, కానీ ఈ ఐదుగురు నేతల వల్ల ఆయనకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. హైకమాండ్ ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

Next Story