- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం మనవడు హఠాన్మరణం.. షాకింగ్ విషయం చెప్పిన పోలీసులు
మనాలీ విహారయాత్రలో జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మనవడు వీర్ సోరెన్ హఠాన్మరణం చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలీలో జార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ నేత చంపై సోరెన్ (Champai Soren) మనవడు వీర్ సోరెన్ (19) మృతిచెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆయన, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపుతోంది. పానిపట్ (Panipat)లోని యూనివర్సిటీలో చదువుతున్న వీర్ సోరెన్, తన ఐదుగురు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం మనాలీ (Manali) వెళ్లారు. అక్కడ సిమ్సా ప్రాంతంలోని ఒక హోమ్‌స్టేలో వీరు బస చేశారు. ఫిబ్రవరి 23 రాత్రి వీర్ సోరెన్ తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. స్నేహితులు ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేసి ఇవ్వగా, అవి వేసుకుని ఆయన నిద్రపోయారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో గదిలో ఏదో పడిపోయిన శబ్దం రావడంతో స్నేహితులు వెళ్లి చూడగా, వీర్ సోరెన్ మంచం పక్కన కింద పడి ఉన్నారు. నోటి నుంచి నురగలు వస్తుండటాన్ని గమనించిన స్నేహితులు వెంటనే ఆయనను మనాలీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు సీపీఆర్ (CPR) చేసి కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ వల్లే..
ప్రాథమిక విచారణలో వీర్ సోరెన్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ స్థాయి తగ్గి వచ్చే ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ (Altitude Sickness) వల్ల ఈ మరణం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలపడంతో భౌతికకాయాన్ని వారికి అప్పగించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంపై సోరెన్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా వీర్ సోరెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.






