Shashi Tharoor: నా మాటలు వక్రీకరించారు

by Shamantha N |

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) కు ఆ పార్టీకి మధ్య గతకొంతకాలంగా విబేధాలు తలెత్తాయి. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ గా మారారని.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చురకలు అంటించారు.

Shashi Tharoor: నా మాటలు వక్రీకరించారు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) కు ఆ పార్టీకి మధ్య గతకొంతకాలంగా విబేధాలు తలెత్తాయి. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ గా మారారని.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చురకలు అంటించారు. అయితే, కాంగ్రెస్ విమర్శలకు శశిథరూర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. విమర్శకులు, ట్రోలర్లు తన అభిప్రాయాలను, మాటలను వక్రీకరించారని ఆరోపించారు. తాను చేయాల్సిన పనులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘నా దగ్గర ఎక్కువ సమయం లేదు. కానీ, గతంలో నియంత్రణరేఖ వెంబడి భారతీయ శౌర్యం గురించి నాకు అజ్ఞానం ఉందని మాట్లాడుతున్న వారి గురించి నేను ఇప్పుడు స్పందిస్తున్నా. నేను ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రతీకార చర్యల గురించే మాట్లాడాను. గత దాడులను గురించి ప్రస్తావించలేదు. ఇటీవల దేశంపై జరిగిన దాడులను, దానికి మన ప్రభుత్వం స్పందించిన విధానాల ఆధారంగానే నేను మాట్లాడాను. అయితే.. ఎప్పటిలాగానే కొందరు విమర్శకులు, ట్రోలర్‌లు తమకు తగినట్లుగా నా మాటలను వక్రీకరించడంలో విజయం సాధించారు. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి’ అని థరూర్‌ రాసుకొచ్చారు.

శశిథరూర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

కాగా.. పనామా పర్యటనలో ఉన్న థరూర్ ఉగ్రదాడుల గురించి స్పందించారు. థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్టీ నేత ఉదిత్ రాజ్ తీవ్రంగా స్పందించారు. "కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీజేపీకి సూపర్ స్పోక్స్‌పర్సన్. బీజేపీ నేతలు కూడా చెప్పని విధంగా ఆయన మోడీజీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసేవో ఆయనకు తెలుసా? భారత సాయుధ బలగాల ఘనతను వీరు (కేంద్ర ప్రభుత్వం) తమ ఖాతాలో వేసుకుంటున్నారు. శశిథరూర్ బీజేపీ ప్రచార విన్యాసాలకు ప్రతినిధిగా మారారు" అని ఉదిత్ రాజ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విమర్శించారు. మరోవైపు, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో థరూర్ వివిధ ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రకటనలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. విదేశాలకు న్యూఢిల్లీ సందేశాన్ని తీసుకెళుతున్న ఏడు భారత ప్రతినిధి బృందాలలో ఒకదానికి శశిథరూర్‌ను ఎంపిక చేయడం కూడా వివాదానికి దారితీసింది. ప్రభుత్వానికి తాము సూచించిన నలుగురు ఎంపీలలో ఆయన లేరని కాంగ్రెస్ నాయకత్వం పేర్కొంది.

Next Story