- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధికుక్కల కేసుపై సుప్రీం సీరియస్: రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరిక
వీధికుక్కల కేసుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేసిన కోర్టు.. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోని రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

దిశ, వెబ్‌డెస్క్: వీధికుక్కల కేసుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేసిన కోర్టు.. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోని రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రతీ కుక్కకాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. గత ఐదేళ్లుగా వీధి జంతువుల నియంత్రణకు సంబంధించి నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది.
మేం కళ్లుమూసుకుని కూర్చోవాలా?
ఇదే సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ప్రభుత్వాలకే కాకుండా, వీధి కుక్కలకు ఆహారం పెట్టే డాగ్ లవర్స్, ఫీడర్స్ కూడా కుక్కల కాట్ల ఘటనలకు బాధ్యులు, జవాబుదారులుగా పరిగణిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఒకసారి కుక్కకాటు పడితే దాని ఎఫెక్ట్ బాధిత వ్యక్తిపై జీవితకాలం పాటు ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. దీనిని జస్టిస్ సందీప్ మెహతా సమర్ధించారు. “ఒక 9 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేస్తే బాధ్యత ఎవరిది? ఆహారం పెట్టే సంస్థలదా? ఈ సమస్యను పట్టించుకోకుండా మేము కళ్లు మూసుకోవాలా?” అని ప్రశ్నించారు.
ప్రతీ కాటు, ప్రతీ మరణానికి భారీ జరిమానా
కుక్కలకు ఎవరు ఆహారం పెట్టినా.. వాటి దాడిలో ఒక చిన్నారి మరణిస్తే దానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. బాలుడి ప్రాణనష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా? అని ప్రశ్నించింది. వీధికుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగు చర్యలు తీసుకోని నేపథ్యంలో ప్రతి కుక్కకాటుకు, కుక్కల దాడిలో జరిగే ప్రతి మరణానికి భారీ పరిహారాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కుక్కలపై ప్రేమ ఉన్నవారు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకోవాలని, వీధుల్లో ఆహారం పెట్టడం సమంజసం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. కుక్కలు వీధులలో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని తాము ఆమోదించబోమని వెల్లడించింది. నవంబర్ 7, 2025న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. అప్పట్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల వంటి ప్రాంతాల నుంచి వీధి జంతువులను తొలగించాలని కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.






