MEA: మైనారిటీ హక్కులపై పాక్ సొంత రికార్డులను చూసుకుంటే మంచిది

by S Gopi |
MEA: మైనారిటీ హక్కులపై పాక్ సొంత రికార్డులను చూసుకుంటే మంచిది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమలులోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం గురించి పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం విరుచుకుపడింది. భారత అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి పాక్‌కు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇతరులకు బోధించే బదులు మైనారిటీ హక్కులపై వారి సొంత అధ్వాన్న ట్రాక్ రికార్డులను చూసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. భారత పార్లమెంటు రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టంపై పాక్ నిరాధారమైన, ప్రేరేపించే ధోరణిలో వ్యాఖ్యలు చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత అంతర్గత విషయాలపై మాట్లాడేందుకు ఎలాంటి అధికారం లేదని ఆయన పేర్కొన్నారు. మైనారిటీల హక్కులను పరిరక్షించే విషయంలో ఇతరులకు బోధించే బదులు పాకిస్థాన్ తన అధ్వాన్నమైన రికార్డులను చూసుకోవడం మంచిదన్నారు. ఇటీవల పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ భారత వక్ఫ్ చట్టంలో చేసిన మార్పులపై మాట్లాడుతూ.. ఈ చట్టంపై భారతీయ ముస్లింల మతపరమైన, ఆర్థిక హక్కులను ఉల్లంఘించేందుకే దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఇది మైనారిటీలను అవమానించడమేనని, వారిని అణగదొక్కేందుకు చట్టాన్ని సవరించారనే ఆందోళనలు ఉన్నాయని అలీ ఖాన్ చెప్పినట్టు పాక్ మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం గట్టిగానే బదులిచ్చింది.

Next Story

Most Viewed