New IT Bill: లోక్‌సభలో కొత్త ఐటీ బిల్లు

by S Gopi |

అనంతరం బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను ఆర్థిక మంత్రి కోరారు.

New IT Bill: లోక్‌సభలో కొత్త ఐటీ బిల్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు. దశాబ్దాల కాలం నుంచి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను ఆర్థిక మంత్రి కోరారు. లోక్‌సభ సెలెక్ట్ కమిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుల వివరాలు, బిల్లు పనితీరుకు సంబంధించి మార్గదర్శకాలను పరిశీలించాలని అభ్యర్థించారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టంలో అనేక సవరణలు జరిగాయి. అలాగే, పాతపన్ను చట్టం వల్ల పన్ను చెల్లింపుదార్లకు వ్యయాలు కూడా పెరిగాయి. ఈ కారణంగానే దీన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

విపక్షాల వాకౌట్

కొత్త ఐటీ బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై వ్యతిరేకత తెలుపుతూ విపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు. నినాదాల మధ్యనే బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానికి సభలోని మెజారిటీ సభ్యుల నుంచి స్పీకర్ ఆమోదాన్ని పొందారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. నిరసనల మధ్య లోక్‌సభ సమావేశాలను మార్చి 10కి వాయిదా వేస్తూ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీ సమీక్షించిన అనంతరం నివేదికను తదుపరి లోక్‌సభ సమావేశాల్లో మొదటి రోజున స్పీకర్‌కు సమర్పిస్తారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి

'నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025'ను 'ఆదాయపు పన్ను చట్టం 2025' అని పిలువనున్నారు. దీన్ని 2026, ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆదాయపు పన్ను చట్టాలను సులభంగా చదివి, అర్థం చేసుకునే విధంగా సరళమైన భాషలో రూపొందించారు.

Next Story