- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flight Accident: ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన ఎయిరిండియా ఫ్లైట్
విమానం కూలిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మెఘాని గుజ్‌సెల్ విమానాశ్రయ సమీపంలో ఎయిరిండియా సంస్థకు చెందిన (బోయింగ్ 787, డ్రీమ్ లైనర్) విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1.39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ టైమ్‌లోనే ఫ్లైట్ కూలినట్లుగా అధికారులు వెల్లడించారు. సివిల్ ఆసుపత్రి సమీపంలో ఓ పెద్ద చెట్టును ఢికొని జనావాసాలపై ఫ్లైట్ ఒక్కసారిగా కూలింది. దీంతో అప్రమత్తమైన మెఘాని గుజ్‌సెల్ ఎయిర్‌పోర్టు అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే, కూలిన ఫ్లైట్‌లో క్యాబిన్ సిబ్బంది సహా.. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 169 మంది భారతీయులతో పాటు 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాాఖ పేర్కొంది. దీంతో మెఘాని గుజ్‌సెల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున ఆంబులెన్స్‌లు చేరుకున్నాయి. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలో అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
విమాన ప్రమాద విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి బయల్దేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఎయిరిండియా ఫ్లైట్ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రియాక్ట్ అయింది. ఫ్లైట్ కెప్టెన్‌గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లుగా తెలిపింది. సుమిత్‌కు ఎల్‌టీసీగా 8,200 గంటలు, కోపైలట్‌కు 1,100 గంటల ఫ్లైట్‌ను నడిపిన అనుభవం ఉందని డీజీసీఏ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
అదేవిధంగా జరిగిన ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 5691 444 ఏర్పాటు చేశారు. ఫ్లైట్ క్రాష్ అయిన మరుక్షణమే అహ్మదాబాద్ విమానాశ్రయంలో అధికారులు విమాన రాకపోకలను తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.






