Tenth Result: 77 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో టెన్త్ పాసైన మొదటి వ్యక్తి.. సన్మానించిన అధికారులు

by Prasad Jukanti |   (  Updated:2025-05-03 08:22:19  IST  )

77 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో తొలిసారి ఓ బాలుడు టెన్త్ పాస్ అయ్యాడు.

Tenth Result: 77 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో టెన్త్  పాసైన మొదటి వ్యక్తి..  సన్మానించిన అధికారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తన గ్రామం నుంచి పదోతరగతి పాసైన తొలి వ్యక్తిగా ఓ బాలుడు రికార్డు సృష్టించాడు. ఇటీవల వెల్లడించిన యూపీ పదో తరగతి ఫలితాల్లో రామ్ కే వాల్ అనే బాలుడు 600 మార్కులకు గాను 322 మార్కులు సాధించాడు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న నిజామ్ పూర్ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా పదో తరగతి పాసవలేదు. కానీ తాజా ఫలితాల్లో విజయం సాధించి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రామ్ కే వాల్ నిలిచాడు. దీంతో అతడిని అధికారులు సన్మానించారు. గ్రామానికి చెందిన జగదీశ్, పుష్ప దేవి దంపతుల కుమారుడు రామ్ కేవాల్. ఇతడి తండ్రి దినసరి కూలీగా పని చేస్తుంటే తల్లి ప్రాథమిక పాఠశాలలో వంటమనిషిగా పని చేస్తోంది. దాదాపు 40 ఇళ్లు 200 జనాభా ఉన్న ఈ గ్రామంలో అందరూ దళిత వర్గానికి చెందిన వారే ఉన్నారు. చాలా మంది గ్రామస్తులు వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈ గ్రామంలో ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాల ఉన్నప్పటికీ గ్రామంలో విద్యాపరంగా ఎటువంటి మైలురాయి చూడలేకపోయింది. ఇక్కడ గరిష్టంగా కొంతమంది 8 లేదా 9 తరగతి వరకు చదువుకున్నారు. ఈ గ్రామానికి 500 మీటర్ల దూరంలో 2013లో అహ్మద్ పూర్ లో ఇంటర్ కాలేజీ ప్రారంభించినా అది ఆ గ్రామంలోని విద్యార్థులను పై చదువులకు ప్రోత్సహించలేకపోయింది. కానీ ఇటీవల డిస్ట్రిక్ట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డిఐఏఎస్) ప్రవేశపెట్టిన మిషన్ పెహ్ చాన్ కార్యక్రమం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని ప్రోత్సహించడంలో పెద్ద పాత్ర పోషించింది. తనకు పెహచాన్ ప్రేరణ ఇచ్చిందని మామ్ కే వాల్ ఫలితాల అనంతరం వెల్లడించాడు. రామ్ కే వాల్ సాధించిన ఫలితం రాబోయే తరాలకు మార్గం చూపిస్తుందని డీఐఓఎస్ ఓపీ త్రిపాఠి అన్నారు. పదోతరగతి పాసైన రామ్ కే వాల్ ను అతడి తల్లిదండ్రులను త్రిపాఠి జిల్లా మెజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని సన్మానించారు.

Next Story