- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీ-295 విమాన ప్రయోగం సక్సెస్
భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. దేశీయంగా తయారైన మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీ-295 (C-295) సైనిక రవాణా విమానం తొలి ప్రయాణ పరీక్ష విజయవంతమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. దేశీయంగా తయారైన మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీ-295 (C-295) సైనిక రవాణా విమానం తొలి ప్రయాణ పరీక్ష విజయవంతమైంది. గుజరాత్‌లోని వడోదరా ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఈ విమానం, తన తొలి గగన విహారాన్ని పూర్తి చేసుకుని సురక్షితంగా ల్యాండ్ అయింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), ఎయిర్‌బస్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ విమానాన్ని పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారు. భారత ప్రైవేట్ రంగంలో ఒక సైనిక విమానం రూపుదిద్దుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మొత్తం ఒప్పందం.. వ్యూహాత్మక బలం
56 విమానాల కోసం స్పెయిన్‌తో రూ. 21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు నేరుగా స్పెయిన్ నుండి రాగా, మిగిలిన 40 విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా వడోదరా ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఆ 40 విమానాల్లో ఇదే మొదటిది. వైమానిక దళంలో చాలా కాలంగా సేవలు అందిస్తున్న పాత ‘ఆవ్రో-748’ విమానాల స్థానంలో ఇవి చేరనున్నాయి. ఇవి దాదాపు 70 మంది సైనికులను లేదా 48 మంది పారాట్రూపర్లను మోసుకెళ్లగలవు.
ప్రత్యేకతలు ఇవే..
రెండు పవర్‌ఫుల్ టర్బోప్రాప్ ఇంజన్లు కలిగిన ఈ విమానాలు.. సరిహద్దుల్లోని కొండ ప్రాంతాలు, చిన్న రన్‌వేలపై కూడా సులభంగా టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వగలవు. విపత్తు సహాయక చర్యల్లోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు
ఈ ఘనతపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం గాల్లోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో భారతదేశ ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన వైమానిక దళం, టాటా, ఎయిర్‌బస్ బృందాలతో పాటు ఇంజనీర్లు, కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు.






