- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ ప్రకటన తర్వాత ఉద్రిక్తతలు.. హర్మూజ్‌ను దాటేందుకు యత్నించిన నౌకలపై కాల్పులు!
హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఆ మార్గం గుండా వెళ్లేందుకు యత్నించిన వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఆ మార్గం గుండా వెళ్లేందుకు యత్నించిన వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు రావాల్సిన రెండు ముడి చమురు నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు తెలిసింది.
జలసంధి మూసివేత.. నౌకలపై కాల్పులు
అమెరికాతో జరిగిన చర్చల్లో చేసుకున్న ఒప్పందాలను నెరవేర్చడంలో అగ్రరాజ్యం విఫలమైందని ఆరోపిస్తూ, హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ నావికాదళం రేడియో సందేశాల ద్వారా ప్రకటించింది. ఏ దేశానికి చెందిన నౌకలైనా సరే ఈ మార్గం గుండా వెళ్లడానికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ ప్రకటన వెలువడిన అనంతరం, జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కు చెందిన గన్‌బోట్లు కాల్పులు జరిపాయి. ఒమన్‌కు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు ‘యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO)’ వెల్లడించింది. అయితే, నౌకలు, అందులోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది.
వెనుతిరిగిన భారత నౌకలు
ఈ కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పలు నౌకలు వెనుతిరిగాయి. ఇరాక్ నుంచి భారత్‌కు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును (Crude oil) తీసుకొస్తున్న రెండు ట్యాంకర్లు సైతం భద్రతా కారణాల దృష్ట్యా హర్మూజ్ జలసంధి నుంచి తమ దారిని మళ్లించినట్లు ‘ట్యాంకర్ ట్రాకర్స్’ తెలిపింది. ప్రపంచంలోని 20 శాతం ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణా జరిగే ఈ కీలక జలమార్గం అకస్మాత్తుగా మూసివేయడంతో గల్ఫ్ ప్రాంతంలో వందలాది నౌకలు నిలిచిపోయాయి. దాదాపు 20 వేల మంది నావికులు సముద్రంలోనే చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.






