Actor Vijay: కిండర్ గార్డెన్ పిల్లల కొట్లటలా ఉంది- త్రిభాషా విధానంపై విజయ్ కామెంట్స్

by Shamantha N |

“కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు సర్కారు మధ్య గొడవ కిండర్ గార్డెన్ పిల్లల కొట్లాటలా ఉంది” అని తమిళగ వెట్రి కళగం పార్టీ(TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ అన్నారు.

Actor Vijay: కిండర్ గార్డెన్ పిల్లల కొట్లటలా ఉంది- త్రిభాషా విధానంపై విజయ్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: “కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు సర్కారు మధ్య గొడవ కిండర్ గార్డెన్ పిల్లల కొట్లాటలా ఉంది” అని తమిళగ వెట్రి కళగం పార్టీ(TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ అన్నారు. కాగా.. గత కొంతకాలంగా కేంద్రం, డీఎంకే మధ్య భాష విషయంలో వివాదం జరుగుతోంది. టీవీకే తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వివాదంపై స్పందించారు. డీఎంకే, బీజేపీలపై విజయ్ విమర్శలు గుప్పించారు. విజయన్ మాట్లాడుతూ.. ‘‘నూతన విద్యావిధానం (NEP), త్రిభాష సూత్రం అమలుపై ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డీఎంకే, బీజేపీ రెండూ పెద్ద పార్టీలైనా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ గేమ్స్‌ ఆడుకుంటున్నాయి. ఒకరు పాడుతుండగా.. మరొకరు డ్యాన్స్ చేస్తున్నారు. రెండు పార్టీలు సమస్యను పరిష్కరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. వారి వివాదం కిండర్ గార్డెన్ పిల్లల కొట్లాటలా ఉంది’’ అని చురకలు అంటించారు.

కేంద్రం బెదిరింపులపై..

కొత్త విద్యావిధానాన్ని అమలు చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్ల నిధులను నిలిపివేస్తామంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన వార్తలపై విజయ్‌ స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు. బీజేపీ, డీఎంకే పార్టీలు నిజాయితీ లేని పార్టీలను మండిపడ్డారు. వారిని అధికారం నుంచి దింపేందుకు కృషి చేయాలని కోరారు. ‘గెట్‌ఔట్‌’ హ్యాష్‌ట్యాగ్‌("#GetOut") పెట్టి వారిని సాగనంపడమే లక్ష్యంగా కలసికట్టుగా కృషి చేద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా, డీఎంకే వ్యతిరేకిస్తున్న త్రిభాషా విధానాన్ని విజయ్‌ కూడా వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. తమిళనాడు ఆత్మగౌరవానికి ప్రసిద్ధి చెందిందని.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర విధానానికి వ్యతిరేకంగా మీరు ఒక భాషను ఎలా విధించగలరు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. 1967, 1977 తమిళనాడు ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1967లోనూ అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం హిందీని భారతదేశ అధికారిక భాషగా గుర్తించాలని ఒత్తిడి చేయడంపై నిరసనలు చెలరేగాయి. అప్పుడు కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా డీఎంకే నిరసనలు వ్యక్తం చేసింది. అవి కాస్తా అల్లర్లకు దారి తీశాయి. దీంతో, అప్పట్లో తమిళనాడులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటమి పాలైంది.

Next Story