FedEx : భారత్‌లో తొలిసారి.. బెంగళూరులో ఫెడెక్స్ డ్రోన్‌ డెలివరీ ప్రయోగాలు విజయవంతం

by Ramesh Naini |   (  Updated:2026-04-21 12:27:08  IST  )

భారతదేశంలో మొట్టమొదటి ఇంట్రా-సిటీ (నగర పరిధిలో) డ్రోన్ డెలివరీ ప్రయోగాత్మక పరీక్షలను బెంగళూరు నగరంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు దిగ్గజ డెలివరీ సంస్థ 'ఫెడెక్స్ (FedEx)' మంగళవారం ప్రకటించింది.

FedEx : భారత్‌లో తొలిసారి.. బెంగళూరులో ఫెడెక్స్ డ్రోన్‌ డెలివరీ ప్రయోగాలు విజయవంతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో మొట్టమొదటి ఇంట్రా-సిటీ (నగర పరిధిలో) డ్రోన్ డెలివరీ ప్రయోగాత్మక పరీక్షలను బెంగళూరు నగరంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు దిగ్గజ డెలివరీ సంస్థ 'ఫెడెక్స్ (FedEx)' మంగళవారం ప్రకటించింది. ఐఐటీ-మద్రాస్ భాగస్వామ్యంతో ఈ డెలివరీ ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించినట్లు వెల్లడించింది.

సగానికి పైగా తగ్గిన డెలివరీ సమయం..

ఐఐటీ-మద్రాస్‌లోని ‘ఫెడెక్స్ స్మార్ట్ సెంటర్’ పరిశోధనల ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. సాధారణంగా రోడ్డు మార్గంలో 53 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పార్శిల్‌ను డెలివరీ చేయడానికి గంటకు పైగా (60 నిమిషాలు) సమయం పడుతుంది. కానీ, గగనతలంలో 39-42 కిలోమీటర్ల ఏరియల్ రూట్ (వాయు మార్గం) ద్వారా కేవలం 21 నిమిషాల్లోనే డ్రోన్ గమ్యస్థానాన్ని చేరుకున్నట్లు ఫెడెక్స్ స్పష్టం చేసింది. అత్యవసర సమయాల్లో సరుకు రవాణా (లాజిస్టిక్స్) రంగంలో ఇది ఒక గొప్ప ముందడుగు అని సంస్థ పేర్కొంది.

డీజీసీఏ ముందస్తు అనుమతులతో..

విమానాశ్రయానికి సమీపంలోని ఎల్లో, రెడ్ జోన్ల మీదుగా ఈ డ్రోన్ ప్రయాణించింది. ఇందుకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ముందస్తుగా అన్ని అధికారిక అనుమతులు తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ విధాన రూపకర్తల భాగస్వామ్యంతో.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ఎయిర్ కార్గో ఆప్టిమైజేషన్, స్థిరమైన సప్లై చైన్ (సరఫరా) వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని ఫెడెక్స్ (MEISA) మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు నితిన్ నవనీత్ తటివాల ఈ సందర్భంగా తెలియజేశారు.

Next Story