- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో ఉత్కంఠ: 15 అడుగుల వ్యవసాయ బావిలో పడిన సింహం!
వేట కోసం జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తూ 15 అడుగుల వ్యవసాయ బావిలో పడిన ఓ సింహాన్ని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా, సురక్షితంగా బయటకు తీశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వేట కోసం జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తూ 15 అడుగుల వ్యవసాయ బావిలో పడిన ఓ సింహాన్ని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా, సురక్షితంగా బయటకు తీశారు. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో సుమారు గంటపాటు ఉత్కంఠగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏప్రిల్ 13న ఉనా తాలూకా నవాబందర్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దారి తప్పి వచ్చిన ఓ సింహం వ్యవసాయ క్షేత్రంలోని నీటితో ఉన్న ఓ బావిలో పడిపోయింది. పైకి రాలేక నీటిలో తడబడుతూ అది చేసిన గర్జనలు విన్న స్థానికులు జసాదర్ అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్‌దీప్ చౌహాన్ నేతృత్వంలోని బృందం, పోలీసుల సాయంతో అక్కడికి చేరుకుంది. సింహాన్ని పైకి లాగేందుకు బావిలోకి బలమైన తాళ్లు వేయగా.. తీవ్ర భయాందోళనల్లో ఉన్న ఆ మృగం వాటిని కొరికేస్తూ సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది.
బోనులోకి మృగరాజు.. ఊపిరిపీల్చుకున్న జనం
సుమారు అరగంట పాటు తీవ్రంగా శ్రమించిన అధికారులు, ఎట్టకేలకు ఓ తాడును ఉచ్చులా వేసి సింహాన్ని పైకి లాగారు. బావి అంచున ముందుగానే సురక్షితంగా ఏర్పాటు చేసిన బోనులోకి అది నేరుగా వెళ్లడంతో అధికారులతో పాటు అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడిన ఆ సింహాన్ని.. వైద్య పరీక్షలు, పర్యవేక్షణ నిమిత్తం జసాదర్ యానిమల్ కేర్ సెంటర్‌కు తరలించారు. అటవీ సిబ్బంది ధైర్యసాహసాలను, వారి సమన్వయాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవీ ఈ రెస్క్యూ వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకున్నారు. నెటిజన్లు సైతం అటవీశాఖ అధికారుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అదే సమయంలో అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న తెరిచిన బావుల వల్ల మూగజీవాలకు పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






