Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలకు లోపభూయిష్ఠమైన డీపీఆర్‌లే కారణం

by Shamantha N |

దేశంలో రోడ్డు ప్రమాదాలు, వాటి మరణాలకు కారణాలపై కేంద్రమంత్రి నితన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోపభూయిష్ఠమైన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) రోడ్డు ప్రమాదాలకు కారణమన్నారు.

Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలకు లోపభూయిష్ఠమైన డీపీఆర్‌లే కారణం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో రోడ్డు ప్రమాదాలు, వాటి మరణాలకు కారణాలపై కేంద్రమంత్రి నితన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోపభూయిష్ఠమైన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) రోడ్డు ప్రమాదాలకు కారణమన్నారు. సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు తయారుచేసిన తప్పుడు డిజైన్లే వీటన్నింటికి కారణమని ఆరోపించారు. గ్లోబల్ రోడ్ ఇన్‌ఫ్రాటెక్ సమ్మిట్, ఎక్స్‌పో (GRIS)లో గడ్కరీ ప్రసంగించారు. దేసంలో అధ్వాన్నమైన నాణ్యతతో డీపీఆర్ లు తయారు చేస్తారని మండిపడ్డారు. సరైన ప్రణాళిక, రూపకల్పన లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి ఇంజనీర్లే ఎక్కువగా బాధ్యులని గడ్కరీ ఎత్తి చూపారు. చాలా రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న తప్పుల వల్లే జరుగుతాయన్నారు. ఈ యాక్సిడెంట్లకు ఎవరూ జవాబుదారీగా ఉండరని అన్నారు.

రోడ్డు భద్రతా చర్యలు మెరుగుపరచాలి

రోడ్డు భద్రతా చర్యలను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుని రోడ్డు భద్రతను పెంచడానికి వ్యూహాలను అభివృద్ధి చేయాలని రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా, దేశంలో సిగ్నల్స్ వ్యవస్థ, మార్కింగ్ వ్యవస్థ వంటి చిన్న విషయాలు కూడా పేలవంగా ఉన్నాయని గడ్కరీ అన్నారు. స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల నుండి మనం చాలా నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు. 2023లో దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల 1,80,000 మరణాలు సంభవించాయని గడ్కరీ అన్నారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2030 నాటికి యాక్సిడెంట్ల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్ (IRF) అధ్యక్షుడు ఎమెరిటస్ కె కె కపిల మాట్లాడుతూ.. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. సున్నా మరణాలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Next Story