SBI YONO: యోనోలో కొత్త డిజిటల్ సేవల వెల్లువ

by S Gopi |

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, బ్యాంకింగ్‌ను మరింత సులభతరం, స్మార్ట్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఎస్‌బీఐ ఛైర్మన్ సీ ఎస్ శెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

SBI YONO: యోనోలో కొత్త డిజిటల్ సేవల వెల్లువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన 71వ బ్యాంక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్, కార్పొరేట్ కస్టమర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, బ్యాంకింగ్‌ను మరింత సులభతరం, స్మార్ట్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఎస్‌బీఐ ఛైర్మన్ సీ ఎస్ శెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 53 కోట్లకు పైగా కస్టమర్లు ఉండగా, కేవలం ‘యోనో’ ప్లాట్‌ఫామ్‌పైనే 10 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త డిజిటల్ విప్లవంలో భాగమైన ఎస్‌బీఐ అల్ట్రా-మోడరన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

డిజిటల్ ‘3-ఇన్-1’ అకౌంట్ ఓపెనింగ్

సాధారణ రిటైల్ కస్టమర్ల కోసం ఈ సూపర్ ఫీచర్‌ను తెచ్చారు. ఇప్పుడు కొత్త యూజర్లు కేవలం ఒకే ఒక్క ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారా సేవింగ్స్ ఖాతాతో పాటు, ఎస్‌బీఐక్యాప్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను కూడా కలిపి ఒకేసారి ఓపెన్ చేయవచ్చు.

ఆన్‌లైన్ శాలరీ అకౌంట్ అప్‌గ్రేడ్

అర్హత కలిగిన కస్టమర్లు బ్యాంకు శాఖల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంట్లో కూర్చునే తమ సాధారణ సేవింగ్స్ ఖాతాలను కార్పొరేట్ శాలరీ అకౌంట్లుగా మార్చుకోవచ్చు లేదా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

పర్యావరణం కోసం ‘గ్రీన్ స్కోర్’

యోనో యాప్‌లో ఒక వినూత్నమైన ‘సస్టైనబిలిటీ’ ఫీచర్‌ను బ్యాంకు తీసుకొచ్చింది. కస్టమర్లు పేపర్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం వల్ల ఎంత కార్బన్ ఉద్గారాలను తగ్గించారో ఇది లెక్కిస్తుంది. కస్టమర్లు వారి నెలవారీ 'గ్రీన్ స్కోర్'ను ఇందులో ట్రాక్ చేయవచ్చు.

మీ జేబుపై నిఘా పెట్టే ‘ఫైనాన్షియల్ ఫిట్‌నెట్

ఇది కస్టమర్ల డిపాజిట్లు, రుణాలు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్, వారి నెలవారీ ఖర్చుల సరళిని పూర్తిగా విశ్లేషిస్తుంది. వినియోగదారుల ఖర్చుల ఆధారంగా వారికి తగిన పర్సనల్ ఆర్థిక సలహాలను అందిస్తూ మనీ మేనేజ్‌మెంట్‌ను ఈజీ చేస్తుంది.

వ్యాపారాల కోసం ‘యోనో జీ’ ఏఐ అసిస్టెంట్

కార్పొరేట్, చిన్న, మధ్య తరహా వ్యాపారాల (ఎంఎస్ఎంఈ) కోసం ‘యోనో బిజినెస్’ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏఐ వర్చువల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్యాంక్ ప్రొడక్ట్స్, సర్వీసుల పరంగా వ్యాపారవేత్తలకు వచ్చే ఎలాంటి సందేహాలకైనా ఇది 24 గంటలూ తక్షణమే సమాధానాలు ఇస్తుంది.

మొబైల్ నుంచే ‘ట్రేడ్ ఫైనాన్స్’ సేవలు

ఎస్‌బీఐ తన పూర్తి ట్రేడ్ ఫైనాన్స్ సూట్‌ను యోనో బిజినెస్ యాప్‌లో విలీనం చేసింది. దీనివల్ల కార్పొరేట్ కస్టమర్లు దేశీయ, విదేశీ ఎగుమతి, దిగుమతి వాణిజ్య లావాదేవీలను బ్రాంచ్‌కు వెళ్లకుండా, తమ మొబైల్ నుంచే సులభంగా పర్యవేక్షించవచ్చు, ఆమోదించవచ్చు.

Next Story