- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ఘోర ప్రమాదం : కుప్పకూలిన ఐరన్ ఫుట్ బ్రిడ్జి.. మురికి కాలువలో పడి మహిళ దుర్మరణం
ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో మంగళవారం ఒక భారీ ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సుమారు 60 అడుగుల పొడవున్న ఈ వంతెన కింద ఉన్న మురికి కాలువలో పడిపోవడంతో, అక్కడే ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో పెను ప్రమాదం సంభవించింది. ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో మంగళవారం ఒక భారీ ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సుమారు 60 అడుగుల పొడవున్న ఈ వంతెన కింద ఉన్న మురికి కాలువలో పడిపోవడంతో, అక్కడే ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 9:28 గంటలకు వంతెన కూలినట్లు పీసీఆర్ కాల్ అందింది. వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది (DFS), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న మురికి కాలువలో గాలింపు చేపట్టిన అధికారులు, సుమారు 50 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలు వంతెన చివర కూర్చునే యాచకురాలని స్థానికులు తెలిపారు. ఆమె వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అధికారుల హెచ్చరికలు బేఖాతరు?
కూలిపోయిన ఈ వంతెన ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్ విభాగానికి చెందినది. ఇది పాతబడటంతో అధికారులు ఇప్పటికే దీనిని ‘ప్రమాదకరమైనది’ (Unsafe) గా ప్రకటించినట్లు స్థానిక నివాసి తెలిపారు. ప్రజలు రాకపోకలు సాగించకుండా ఇరువైపులా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే, హెచ్చరికలను లేక్క చేయకుండ ప్రజలు వంతెనను ఉపయోగిస్తున్నారని, ఈ క్రమంలోనే ఈ విషాదం చోటుచేసుకుందని స్థానిక నివాసి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ బోట్ క్లబ్ బృందం మహిళ మృతదేహాన్ని బయటకు తీసింది. మరికొందరు కాలువలో చిక్కుకున్నారేమో అన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి తదుపరి విచారణ చేపట్టారు.






