Rahul Gandhi: ప్రభుత్వం తీసుకునే చర్యకు మద్దతిచ్చేందుకు రెడీ

by Shamantha N |

పెహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎంతో భేటీ కావడంతోపాటు ఉగ్రదాడి బాధితులను కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

Rahul Gandhi: ప్రభుత్వం తీసుకునే చర్యకు మద్దతిచ్చేందుకు రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎంతో భేటీ కావడంతోపాటు ఉగ్రదాడి బాధితులను కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే భారతీయులంతా ఐక్యంగా ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “ఇది ఒక భయంకరమైన విషాదం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, సాయం చేసేందుకే ఇక్కడికి వచ్చా. జమ్ముకశ్మీర్ ప్రజలు ఈ భయంకరమైన చర్యను ఖండించారు. ఈ సమయంలో వీరికి దేశం మొత్తం మద్దతిచ్చింది. గాయపడిన వారిలో ఒకరిని నేను కలిశాను. కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రతి ఒక్కరి బాధ అర్థం చేసుకోగలను. ప్రభుత్వం తీసుకోవాలనుకునే ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు

ఐక్యంగా ఉండటం ముఖ్యం

అంతేకాకుండా, ఈ దాడి వెనుక ఉన్న ఆలోచన సమాజాన్ని విభజించడమే అని అన్నారు. “ఉగ్రవాదులు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఓడించడానికి ప్రతి భారతీయుడు ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యం. కశ్మీర్‌తోపాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరం. మనందరం ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రితోనూ భేటీ అయ్యా. ఏం జరిగిందో వారు వివరించారు. మా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని వారిద్దరికీ హామీ ఇచ్చా’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇకపోతే, ఏప్రిల్ 22న పెహల్గామ్ లో పర్యాటకులపై ముష్కరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

Next Story