Fake envoy: రూ.300 కోట్ల స్కామ్,162 విదేశీ పర్యటనలు.. నకిలీ రాయబారి విచారణలో షాకింగ్ విషయాలు

by B.Srinivas |

ఉత్తరప్రదేశ్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నడుపుతున్న హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Fake envoy: రూ.300 కోట్ల స్కామ్,162 విదేశీ పర్యటనలు..  నకిలీ రాయబారి విచారణలో షాకింగ్ విషయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వెస్ట్ ఆర్కిటికా పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నడుపుతున్న హర్షవర్ధన్ జైన్ (Harshavardhan jain) అనే వ్యక్తిని యూపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వద్ద నుంచి కీలక వివరాలను అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. హర్షవర్ధన్ గత పదేళ్లలో 162 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లాడని, రూ.300 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) కొనసాగుతున్న దర్యాప్తులో వెల్లడైంది. అతను మోసపూరిత ఉద్యోగ రాకెట్‌ను నడుపుతున్నాడని, హవాలా మార్గాల ద్వారా మనీలాండరింగ్‌లో కూడా పాల్గొన్నాడని అధికారులు భావిస్తున్నారు. జైన్ ఈ నకిలీ దౌత్య వ్యవస్థను ఉపయోగించి నెట్‌వర్క్‌లను నిర్మించి, విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ప్రజలను ఆకర్షించాడని తెలిపారు. జైన్ ప్రస్తుత ఇంటిని ఆరు నెలల క్రితమే అద్దెకు తీసుకున్నప్పటికీ, నకిలీ కాన్సులేట్ 2017 నుంచి పనిచేస్తోందని సమాచారం. జైన్ 2005-2015 మధ్య 19 దేశాల్లో పర్యటించారు. యూఏఈ 54 సార్లు, బ్రిటన్ ను 22 సార్లు సందర్శించాడు. దౌత్యపరమైన కార్యకలాపాల ముసుగులో మారిషస్, ఫ్రాన్స్, కామెరూన్, యూరప్‌లోని స్వయం ప్రకటిత మైక్రోనేషన్ అయిన సెబోర్గా వంటి ఇతర దేశాలకు కూడా ఆయన విమానంలో వెళ్ళినట్టు తెలుస్తోంది.

జైన్ అంతర్జాతీయ స్థాయిలో మోసపూరిత కార్యకలాపాలు నిర్వహించగా దీనికి హైదరాబాద్‌లో జన్మించిన తుర్కియే జాతీయుడు అహ్సాన్ అలీ సయ్యద్ సహకారం ఉందని ఆయనతో అనేక విదేశీ కంపెనీలను రిజిస్టర్ చేశాడని సమాచారం. మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే 25 షెల్ కంపెనీలను తెరవడానికి కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. దర్యాప్తు అధికారులు ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తున్నారు. హవాలా మార్గాలు, షెల్ కంపెనీలు, విదేశీ ఖాతాల ద్వారా రూ. 300 కోట్లు ఎలా నల్లధనం ద్వారా మళ్లించబడ్డాయో గుర్తిస్తున్నారు.

Next Story