Fake Encounter: అది పక్కా బూటకపు ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల సంచలన లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-03 05:14:02  IST  )

భద్రతా బలగాలు వరుస ఎన్‌కౌంటర్లకు తెగబడుతోన్న వేళ భాతర కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) దండకారాణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో పలు సంచలన విషయాలు వెల్లడించింది.

Fake Encounter: అది పక్కా బూటకపు ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రతా బలగాలు వరుస ఎన్‌కౌంటర్లకు తెగబడుతోన్న వేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. దంతెవాడ - బీజాపూర్ సరిహద్దు వద్ద మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్ పక్కా బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపించించారు. కామ్రేడ్ రేణుక అలియాస్ చైతేను అరెస్టు చేసిన తర్వాతే హత్య చేశారంటూ ఫైర్ అయ్యారు. కార్పొరేట్ దోపిడీని సులభతరం చేసేందుకు దేశంలో ఈ నరమేధానికి తెరలేపారని ఆక్షేపించారు. ఆదివాసీలు, విప్లవకారులు ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు.

పోలీసుల తప్పుడు ప్రకటన

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు కామ్రేడ్ రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే (55)ను దంతెవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఇంద్రావతి నది తీరంలో మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లుగా పోలీసులు తప్పుడు ప్రకటన విడుదల చేశారని ధ్వజమెత్తారు. వాస్తవానికి కామ్రేడ్ చైతే బీజాపూర్ జిల్లా భైరంగఢ్ బ్లాక్‌లోని బెల్నార్ గ్రామంలోని ఓ ఇంట్లో అనారోగ్యం కారణంగా ఒంటరిగా ఉందని తెలిపారు. పక్కా సమాచారంతతో మార్చి 31 తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి కామ్రేడ్ చైతేను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్టు చేసిన చోటే, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు 2 నుంచి మూడు గంటల పాటు విచారణ జరిపారని తెలిపారు. అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఆమెను ఇంద్రావతి నది తీరానికి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. సాయుధ మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆ ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ చైతే అమరురాలైందని, అక్కడ ఓ ఇన్సాస్ రైఫిల్ లభించిందని చెప్పడం అంతా అబద్ధమని ఖండించారు.

సుధీర్‌ను కూడా అలాగే..

మార్చి 25న కూడా ఇంద్రావతి ప్రాంతంలోని బోడ్గా గ్రామంలో తమ సీనియర్ కామ్రేడ్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు కామ్రేడ్ లంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, కొంతమంది గ్రామస్థులను అరెస్టు చేశారని తెలిపారు. కామ్రేడ్ సుధీర్‌ను కూడా పోలీసు అధికారులు అక్కడే విచారణ చేశారు. ఉదయం 10 గంటల సమయంలో సుధీర్, అరెస్టు చేయబడిన గ్రామస్థులలో ఇద్దరు యువకులను గ్రామం బయటకు తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపించారు. ఆ సమయంలో కూడా సాయుధ మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆ ఎన్‌కౌంటర్‌లో రూ.25 లక్షల రివార్డు ఉన్న ఎస్‌జెడ్‌సీ సభ్యుడిని చంపినట్లుగా పోలీసులు తప్పుడు ప్రకటను విడుదల చేశారని పేర్కొన్నారు. కామ్రేడ్ సుధీర్‌తో సహా ఎన్‌కౌంటర్లలో 2025 జనవరి నుంచి నేటి వరకు అమరులైన అందరు కామ్రేడ్‌లకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తలవంచి వినమ్ర శ్రద్ధాంజలి అర్పిస్తోందని లేఖలో ప్రస్తావించారు. విప్లవకారుల త్యాగాలు వృథా కావు.. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టుల కలలు సాకారం కావని అన్నారు.

ధృడ సంకల్పంతోనే ‘చైతే’ చివరి శ్వాస వరకు..

కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతే (55) అసలు తెలంగాణలోని జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందినవారని తెలిపారు. తిరుపతిలో ఎల్‌ఎల్‌బీ ఫస్ట్ క్లాస్‌లోఉత్తీర్ణురాలై, సుమారు 35 ఏళ్లుగా విప్లవ ఉద్యమంలో తన సేవలను అందిస్తూ, ప్రతి మలుపులో ఉద్యమంతోనే ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం ఉన్నప్పటికీ, చివరి శ్వాస వరకు పార్టీ ఇచ్చిన అన్ని బాధ్యతలను దృఢ సంకల్పం నిర్వర్తించారని కొనియాడారు. మొదటి నుంచి తెలంగాణ, దండకారణ్య మహిళా విముక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దండకారణ్య మహిళా సబ్ కమిటీలో ఉన్నారని.. దండకారణ్య స్పెషల్ జోన్ రాజకీయ ముఖ పత్రం 'ప్రభాత్' విప్లవ ఆదివాసీ మహిళా సంస్థ ముఖపత్రం 'సంఘర్షరత్ - మహిళ', దాని గోండీ భాషా సంచిక 'లడేమాయన - మహిళ' పత్రికలను అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ నియమితంగా ప్రజలకు చేర్చే తన బాధ్యతను ఆమె సమర్ధవంతగా నిర్వర్తించారని తెలిపారు. అదేవిధంగా సీఆర్‌బీ రాజకీయ పత్రిక 'క్రాంతి' సంపాదక మండలిలో కూడా పని చేశారని గుర్తు చేశారు. దండకారణ్య జోన్ ఉద్యమానికి అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయడంలో కూడా ఆమె సహకారం అందించారని పేర్కొన్నారు. అణగారిన ప్రజల సమస్యలు.. వాటి పరిష్కారం దిశగా అనేక వ్యాసాలు, కథలు రాశారు తెలిపారు. దండకారణ్య విప్లవ ఉద్యమంలో చురుకైన రాజకీయ పాత్ర పోషించిన ప్రజా నాయకురాలు, విప్లవ రచయిత్రి, విప్లవ బుద్ధిజీవిని కోల్పోవడం మా ఉద్యమానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఎస్‌జెడ్‌సీ తలవంచి కామ్రేడ్ చైతేకు వినమ్ర శ్రద్ధాంజలి అర్పిస్తుందని.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతిని వ్యక్తం చేస్తుందని వికల్ప (ప్రవక్త) పేరుతో లేఖలో ప్రస్తావించారు.

నర సంహారం జరుగుతోంది..

దేశంలో అధికారంలో ఉన్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టులు అణగారిన ప్రజలు, వారి పక్షాన లడే విప్లవకారులపై తీవ్రమైన అణచివేత, ప్రతివిప్లవ యుద్ధాన్ని ప్రకటించారు. దేశంలో విప్లవ ఉద్యమాన్ని అంతం చేసి, దండకారణ్యంతో సహా ఇతర ప్రాంతాల అడవుల్లో ఉన్న అపారమైన సహజ సంపదను స్వదేశీ-విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కాసుల కొద్దీ అప్పగించడం, కార్పొరేట్ హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం విప్లవకారులు ఆదివాసీల నరసంహారం జరుగుతోందని అన్నారు. చట్టవిరుద్ధమైన, అప్రజాస్వామిక, అమానవీయ పద్ధతులతో శవాలను లెక్కించే ఆట జరుగుతోందని ఆక్షేపించారు. అడవుల్లోని ఆదివాసీ గ్రామాల నుంచి ఎంత ఎక్కువ శవాలను తెస్తే అంత పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇదంతా మన దేశంలోని తథాకథిత నాయకులు, ఉన్నతాధికారులతోనే జరుగుతోందని అన్నారు. ‘లొంగిపోండి.. లేకపోతే చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారని, ఏ రాజ్యాంగం, చట్టం కింద ఇలా చెబుతున్నారో అర్థం కాడం లేదని అన్నారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామ్య, ప్రగతిశీల, లౌకికవాద, విప్లవ సామాజిక సంస్థలు, వర్గాలు, వ్యక్తులు గొంతు విప్పాలని విజ్క్షప్తి చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లతో సహా అన్ని ఘటనలపై న్యాయ విచారణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజాపక్ష మీడియా ఘటనా స్థలాన్ని సందర్శించి, వాస్తవాలను ప్రపంచం ముందుంచాలని కోరారు. తీవ్రమైన అణచివేత కారణంగా ఇతర ముఖ్యమైన అంశాలను ఈ సమయంలో వెల్లడించలేకపోతున్నామని లేఖలో వెల్లడించారు.

Next Story