విద్యుత్ అధికారుల తీరు పై ప్రజల ఆగ్రహం

by Batti.Sumithra |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో గత నెల రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో విద్యుత్ శాఖ అధికారుల తీరు పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ అధికారుల తీరు పై ప్రజల ఆగ్రహం
X

దిశ, వాంకిడి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో గత నెల రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో విద్యుత్ శాఖ అధికారుల తీరు పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11 కేవీ లైన్ పనుల సాకుతో రోజు విడిచి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, సాయంత్రం 5 లేదా 6 గంటలు దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో విధులు నిర్వహిస్తున్న ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉండరని, సమస్యలు తలెత్తినప్పుడు ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులు మండలంలో ఎందుకు ఉన్నారు ? ప్రజల కోసమా, లేక మరెవరి కోసమా పని చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే విద్యుత్ కోత ఉంటుందని సమాచారం ఇచ్చినప్పటికీ, మధ్యాహ్నం 3 గంటలు దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఏడీఈ వెంటనే స్పందించి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పై అనవసర విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకుని నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని కోరుతున్నారు.

Next Story