- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawar Vs Fadnavis : ఈవీఎంల ఇష్యూ.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. సీఎం ఫడ్నవిస్ కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Poll Results) ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Poll Results) ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) అన్నారు. ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేకపోయినా.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాటి ద్వారా ఓట్లు వేశారని పేర్కొన్నారు. అమెరికా, ఇంగ్లండ్ సహా ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతుంటే.. భారత్‌లో మాత్రమే ఈవీఎంలు ఎందుకు వాడుతున్నారని శరద్ పవార్ ప్రశ్నించారు. ఇప్పుడు దేశ ప్రజలు బ్యాలట్‌లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో నిర్వహించిన ఈవీఎం వ్యతిరేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా తనకు అందించాలని, వాటిని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర సీఎంకు పంపిస్తానని శరద్ పవార్ చెప్పారు. ఇక ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ శనివారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఎమ్మెల్యేలు నిరాకరించారు. ఈ క్రమంలో వారు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్లలో మాదే ముందంజ : సీఎం
మహాయుతి కూటమి విజయంపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Fadnavis) తప్పుపట్టారు. ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలని ఆయనకు సూచించారు. ప్రతిపక్ష ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ) కూటమి ఓటమికి దారితీసిన కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని శరద్ పవార్‌ను కోరారు.‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 1.49 కోట్ల ఓట్లతో 9 ఎంపీ సీట్లను గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీ 96 లక్షల ఓట్లతో 13 సీట్లను గెల్చుకుంది. శివసేన 73 లక్షల ఓట్లతో 7 సీట్లను గెల్చుకుంది. శరద్ పవార్ -ఎన్‌సీపీ 58 లక్షల ఓట్లతో 8 సీట్లను గెల్చుకుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది’’ అని ఫడ్నవిస్ పేర్కొన్నారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 87 లక్షల ఓట్లు వచ్చిన ఒక్క లోక్‌సభ సీటే వచ్చింది. అప్పట్లో ఉమ్మడి ఎన్‌సీపీకి 83 లక్షల ఓట్లు వచ్చినా 4 సీట్లే వచ్చాయి. విపక్ష కూటమిలోని పార్టీలన్నీ ఓటమిని అంగీకరించి ఆత్మపరిశీలన మొదలుపెట్టాలి’’ అని మహారాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు.






