Exit Polls: బెంగాల్ గద్దెపై కమలనాథులు.. ఐదు రాష్ట్రాల ‘చాణక్య స్ట్రాటజీస్’ ఎగ్జిట్ పోల్స్ ఇవే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-29 13:29:41  IST  )

2026 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై 'చాణక్య స్ట్రాటజీస్' ఎగ్జిట్ పోల్ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

Exit Polls: బెంగాల్ గద్దెపై కమలనాథులు.. ఐదు రాష్ట్రాల ‘చాణక్య స్ట్రాటజీస్’ ఎగ్జిట్ పోల్స్ ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిశాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రాజకీయ సర్వే సంస్థ ‘చాణక్య స్ట్రాటజీస్’ (Chanakya Strategies) తన ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించింది. 2026 ఏప్రిల్ 29న విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్ల నాడి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం పట్టు నిలుపుకోగా.. మరికొన్ని చోట్ల మార్పు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో ‘కమల’ వికాసం..

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. భద్రతా బలగాల భారీ బందోబస్తు నడుమ రెండు దశల్లో పోలింగ్ కొనసాగింది. ఇందులో అధికార తృణమూల్ కాంగ్రెస్ (AITC), ప్రధాన ప్రతిపక్షం (BJP) మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఈసారి అక్కడ కమలనాథులు కూటమి స్వల్ప మొగ్గుతో 150 నుంచి 160 స్థానాలను సాధించి అధికార పీఠానికి చేరువయ్యే అవకాశం ఉండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 130 నుంచి 140 స్థానాల్లో నిలవవచ్చని సర్వే పేర్కొంది. ఓట్ల శాతంలో కూడా బీజేపీ కూటమి 43-45 శాతంతో తృణమూల్ (40-43 శాతం) కంటే ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

తమిళనాడులో స్టాలిన్‌కే ‘జై’ కొట్టిన ఓటర్లు..

డీలిమిటేషన్‌ బిల్లు వివాదం నేపథ్యంలో అక్కడ కేంద్రం వర్సెస్ తమిళనాడులా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే, డీఎంకే నేతృత్వంలోని ఎస్‌పీఏ (SPA) కూటమి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించి, తిరిగి అధికారాన్ని చేపట్టనుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంచనా వేసింది. మొత్తం 234 స్థానాల్లో ఈ కూటమికి 145 నుంచి 160 సీట్లు లభించే అవకాశం ఉండగా, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK) 50 నుంచి 65 స్థానాలకే పరిమితం కావొచ్చిన తెలిపింది. ఇక నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 12 శాతం నుంచి 16 శాతం ఓట్ల శాతాన్ని సాధించి, సుమారు 13 నుంచి 18 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంచనా వేసింది.

కేరళలో కాంగ్రెస్.. అస్సాంలో బీజేపీ

ఇక కేరళలో ఈసారి అధికార మార్పు ఖాయంగా కనిపిస్తున్నట్లుగా సర్వే తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి 72 నుంచి 80 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా, ప్రస్తుత అధికార ఎల్డీఎఫ్ (LDF) 58 నుంచి 64 స్థానాలకు పడిపోవచ్చని అంచనా వేశారు. అటు అస్సాంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి తన పట్టును నిరూపించుకుంటూ 88 నుంచి 98 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేయనుంది. సీఎం హిమంత బిశ్వ శర్మ చరిశ్మా స్పష్టంగా పని చేసినట్లుగా సర్వే వెల్లడించింది. దీంతో అక్కడ బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లుగా సర్వేలో వెల్లడైంది.

పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి హవా..

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ (NDA) కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది. విపక్ష కూటమి ఎస్‌పీఏ (SPA) గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో విఫలమవుతుందని సర్వే అంచనా వేసింది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 17 నుంచి 20 స్థానాలు దక్కించుకుని అధికారాన్ని చేపట్టబోతోంది. ఇక కాంగ్రెస్, డీఎంకే ఎస్‌పీఏ కూటమి 9 నుంచి 13 స్థానాలకే పరిమితం కానుంది. చివరగా విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి కేవలం ఒకే ఒక్క స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉంది.

కాగా, ‘చాణక్య స్ట్రాటజీస్’ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 5 రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని సూచిస్తున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడూ తుది ఫలితాలకు దిక్సూచి మాత్రమేనని, అసలు విజేతలెవరనేది మే 4న వెలువడే అధికారిక ఫలితాల్లోనే తేలుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story