Pakistan : పరాజయానికి ప్రమోషన్లా?.. పాక్ పై బీజేపీ విమర్శలు

by Shamantha N |

పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వంపై బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించింది. పాక్ సైనిక బలగాల ప్రధానాధికారి ఆసీమ్‌ మునీర్‌ (Asim munir)కు ఫీల్డ్‌ మార్షల్‌గా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

Pakistan : పరాజయానికి ప్రమోషన్లా?.. పాక్ పై బీజేపీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వంపై బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించింది. పాక్ సైనిక బలగాల ప్రధానాధికారి ఆసీమ్‌ మునీర్‌ (Asim munir)కు ఫీల్డ్‌ మార్షల్‌గా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే, ఈ ప్రమోషన్ పై బీజేపీ(BJP) ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాల్వియా (Amit Malviya) స్పందించారు. పరాజయానికి కూడా ప్రమోషన్లు ఉంటాయా అంటూ పాకిస్థాన్‌ను ఎగతాళి చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘వైఫల్యానికి కూడా రివార్డులుంటాయనే దానికి ఇదే ఉదాహరణ. భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌ కు కోలుకోలేని దెబ్బకొట్టాం. 9 ఉగ్రస్థావరాలను నేలకూల్చాం. 13 వైమానిక స్థావరాలు, జాతీయ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థతో పాటు వందలాది డ్రోన్‌లను ధ్వంసం చేశాం. పాకిస్థాన్ కు చెందిన 70 మందికి పైగా సైనిక సిబ్బంది మరణించారు. ఈ దెబ్బలకు తట్టుకోలేక కాల్పుల విరమణ చేపట్టాలని మనల్ని అభ్యర్థించింది. అయినప్పటికీ.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌గా పదోన్నతి కల్పించారు. పదే పదే వైఫల్యాలు ఎదురైనా ఆనందాన్ని ఆస్వాదించే యువరాజు ఒకరు మాత్రమే ఉన్నారు. అది ఎవరో మనందరికీ తెలుసు’ అని మాల్వియా పేర్కొన్నారు.

పాక్‌ సైనిక ప్రధానాధికారికి పదోన్నతి

ఇకపోతే, పహెల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ (India) ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)ను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను మన బలగాలు నేలమట్టం చేశాయి. దీంతో పాక్‌ ఎదురుదాడికి యత్నించింది. వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్‌ను చావుదెబ్బ తీశాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మునీర్‌కు పదోన్నతి కల్పిస్తూ పాక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్‌ చరిత్రలో ఆ స్థాయి పొందిన రెండో వ్యక్తిగా మునీర్ నిలిచారు. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో ఇటీవలే జరిగిన సైనిక సంఘర్షణలో కీలక పాత్ర పోషించిన కారణంగా ఆయనకు పదోన్నతి కల్పించినట్టు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. దీనిపైనే బీజేపీ విమర్శలు గుప్పించింది.

Next Story