- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ప్రియుడి ప్రతీకారం.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి, వైరల్ అవుతున్న CCTV వీడియో
బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువతి ఇంటిపై ఆమె మాజీ ప్రియుడు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇంట్లో చదువుకుంటున్న ఆ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కోయంబత్తూరులోని తొండముత్తూరు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువతి ఇంటిపై ఆమె మాజీ ప్రియుడు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇంట్లో చదువుకుంటున్న ఆ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
సీసీటీవీ దృశ్యాల్లో ఏముందంటే..?
తొండముత్తూరు సమీపంలోని కలిక్కనాయకన్‌పాళయం ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. సీసీటీవీ ఫుటేజీలో ఇంటి ప్రవేశద్వారం ప్రశాంతంగా కనిపిస్తాయి. అక్కడే ఒక ఎర్రటి స్కూటర్ పార్క్ చేసి ఉంది. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు బైక్ పై అక్కడికి చేరుకున్నారు. క్షణాల్లోనే పెట్రోల్ బాంబ్ సీసాలను ఇంటిపైకి విసరడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి స్కూటర్, ప్రవేశద్వారం వద్ద దట్టమైన పొగను వ్యాపింపజేశాయి. ఈ ఆకస్మిక దాడికి సీసీటీవీ కెమెరా కూడా స్వల్పంగా కదిలినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ మంటలు ఇంటి బయట మాత్రమే పరిమితం కావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
నేర చరిత్ర తెలిసి బ్రేకప్ చెప్పిన యువతి..
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుల్లో ప్రధాన వ్యక్తిని చెన్నైకి చెందిన కార్తీక్ అలియాస్ మరియప్పన్‌గా గుర్తించారు. బాధితురాలి తండ్రి, తాలియూర్ టౌన్ పంచాయతీ ఉద్యోగి అయిన సుందరమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయంబత్తూరులోని ఓ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ యువతికి కార్తీక్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసింది. అయితే, కార్తీక్‌పై హత్య, దోపిడీ సహా తమిళనాడులోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఏకంగా 31కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని యువతికి తెలిసింది. దీంతో ఆమె వెంటనే అతడికి బ్రేకప్ చెప్పింది. అప్పటినుంచి తనతో తిరిగి సంబంధం కొనసాగించాలని అతడు యువతిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు.
దాడికి ముందు బెదిరింపులు..
ఆదివారం సాయంత్రం కార్తీక్ తన ముగ్గురు అనుచరులతో కలిసి రెండు బైక్‌ల (కేటీఎం, బజాజ్ పల్సర్) పై యువతి ఇంటికి వచ్చాడు. దాడికి పాల్పడటానికి ముందు, ఇంటి బయట నిలబడి ఉన్న యువతి తండ్రి సుందరమూర్తిని అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత పెట్రోల్‌తో నింపిన బీర్, మద్యం సీసాలను ఇంటిపైకి విసిరారు. దాడి జరిగిన సమయంలో యువతి ఇంట్లో చదువుకుంటూ ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని సౌత్ ఫస్ట్ వార్తా సంస్థ నివేదించింది.
పోలీసుల గాలింపు ముమ్మరం
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడినప్పటికీ, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సుందరమూర్తి ఫిర్యాదు మేరకు తొండముత్తూరు పోలీసులు కార్తీక్ సహా మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.






