Ankita Bhandari: ఆంకితా భండారి హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు

by Shamantha N |

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన అంకితా భండారి హత్య కేసులో ఉత్తరాఖండ్ స్థానికకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Ankita Bhandari: ఆంకితా భండారి హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన అంకితా భండారి హత్య కేసులో ఉత్తరాఖండ్ స్థానికకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లోని సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. పుల్కిత్ తో పాటు అతని ఇద్దరు ఉద్యోగులు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. మే 19న తుది వాదనలు విన్న కోర్టు శుక్రవారం తీర్పుని వెలువరించింది. హత్య, లైంగిక వేధింపులు, నేరపూరిత సెక్షన్ల కింద కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి తీర్పు వెలువరించింది. కాగా.. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సిట్.. హత్య, లైంగిక వేధింపులతో పాటు పలు నేరాల సెక్షన్ల కింద నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తి చేసి 500 పేజీల ఛార్జిషీట్‌ రూపొందించింది. 2023 మార్చి చివర్లో కోట్‌ద్వార్‌ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 97 మంది సాక్షుల్లో.. 47 మందిని కోర్టు విచారించింది. రెండేళ్లపాటు సాగిన విచారణ తర్వాత.. అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి రీనా నేగీ.. ఆ ముగ్గురిని దోషులుగా ప్రకటించారు. దోషులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. అయితే, అంకిత కుటుంబం మాత్రం మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తోంది.

అసలు కేసు ఏంటంటే?

పౌరీ జిల్లాకు చెందిన అంకిత భండారి(19) రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పని చేసేది. అయితే 2022 సెప్టెంబర్‌ 18 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాలువలో కనిపించింది. ఆమెపై హత్యాచారం జరిగి ఉండొచ్చన్న ప్రచారం జరగడంతో.. ఆ ప్రాంతంలో తీవ్రనిరసనలు వెల్లువెత్తాయి. పుల్కిత్‌ ఆర్య(Pulkit Arya) తండ్రి వినోద్‌ ఆర్య బీజేపీ నేత. దీంతో కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో వినోద్‌ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో రిసార్ట్‌ ఆపరేటర్‌ పుల్కిత్‌ ఆర్య, మరో ఇద్దరు ఉద్యోగులు సౌరభ్‌ భాస్కర్‌, అకింత్‌ గుప్తాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ నివేదిక ధృవీకరించింది. తన రిసార్ట్‌కు వచ్చేవాళ్లతో పాటు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అంకితపై పుల్కిత్‌ ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె లొంగలేదు. 2022 సెప్టెంబర్‌ 18న ఆమెతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో పుల్కిత్‌ తన మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమెను కాలువలోకి తోసి చేశాడని తేలింది.

Next Story